15 ఏళ్ల తరువాత కురిసిన అతి భారీవర్షంతో.. విజయవాడలో..
ABN , First Publish Date - 2020-10-14T15:45:14+05:30 IST
జలదారులైన రహదారులు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. చెరువులను తలపిస్తున్న..

కుంభవృష్టి
15 ఏళ్ల తరువాత అతి భారీవర్షం
పొంగుతున్న వాగులు, వంకలు
ఏనుగుగడ్డ వాగులో యువకుడి గల్లంతు
10 వేల హెక్టార్లలో పంట మునక
పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం
విస్సన్నపేటలో అత్యధికంగా 192.2మి.మీటర్ల వర్షపాతం
విజయవాడలో 162.8 మి.మీటర్లు
విరిగిపడిన కొండచరియలు
విద్యాధరపురంలో ఒకరి దుర్మరణం
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: జలదారులైన రహదారులు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. చెరువులను తలపిస్తున్న పంటపొలాలు... తలలు వాల్చిన పైర్లు.. ఎటు చూసినా వర్ష బీభత్సమే.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఏకధాటిగా కురిసిన వర్షం రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. వర్షానికి పంటలను కోల్పోయి రైతులు.. ఇళ్లు నీట మునగగా కన్నీటితో లోతట్టు ప్రజలు దిక్కుతోచక బిక్కమొగమేస్తున్నారు. 15 ఏళ్ల తరువాత కురిసిన అతి భారీవర్షంతో విజయవాడ నగరంలో రోడ్లు, డ్రైయిన్లు ఏకమయ్యాయి. కొండచరియలు విరిగిపడుతూ, కొండ ప్రాంత ప్రజల కంటిపై కునుకు లేకుండా చేశాయి.
ఎడతెరపిలేని వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. రైతుల ఆశలను తలకిందులు చేసింది. ఆరుగాలం శ్రమించి కాపాడుకున్న పంటలు వర్షార్పణమయ్యాయి. ఈ ఏడాది పైర్లు ఏపుగా ఎదిగాయి.. మంచి దిగుబడులు వస్తాయనే రైతుల ఆశలను వాయుగుండం తుడిచిపెట్టేసింది. వరి, మిర్చి పైర్లు తలలు వాల్చాయి. చేతికంది వచ్చిన పత్తి చేజారిపోయింది. జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన కుంభవృష్టి రైతులకు కన్నీటినే మిగిల్చింది. ఎటు చూసినా నీరే.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ విధ్యాధరపురం కొండప్రాంతంలో రెండు ఇళ్లు ధ్వంసంకాగా ఒకరు మరణించారు. మైలవరం నియోజకవర్గం కొటికలపూడి వద్ద ఏనుగుగడ్డ వాగులో ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఆర్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ - హైదరాబాద్ హైవేపైకి మునగచర్ల వద్ద వర్షం నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పొంగి పొరలుతున్న వాగులు
15 ఏళ్ల తరువాత కురిసిన అతి భారీ వర్షం కారణంగా జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. కైకలూరులో లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. విస్సన్నపేటలో కలగర, రామచంద్రాపురం, చుండ్రుపట్ల గ్రామాల్లో చెరువులు నిండటంతో గట్లు తెగుతాయనే భయం ఆయా గ్రామస్తులను వెంటాడుతోంది. పశ్చిమ కృష్ణాలోని పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల దళితవాడలోకి వర్షపు నీరు చేరడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముసునూరు మండలంలో తమ్మిలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. సింహాద్రిపురం వద్ద రామిలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నూజివీడు-ఏలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బలివే-వెంకటాపురం వద్ద ఉన్న వేల్పుచర్ల చెక్ డాంకు పెద్ద గండి పడింది.
నందిగామ మండలం కూచివాగు కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో మాగల్లు-అడవిరావులపాడు మధ్య రాకపోకలు నిలిచి పోయాయి, కంచికచర్ల-జుజ్జూరు రహదారి జలమయం కావడంతో ప్రజల రాక పోకలకు ఆటంకం ఏర్పడింది. ఏ-కొండూరు మండలంలో పులివాగు ఉధృతికి సున్నం పాడు వద్ద చప్టా కొట్టుకుపోయింది. దీంతో ఎర్రుపాలెం - సున్నంపాడుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఓబులాపురం వద్ద పెద్దవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో నరుకుళ్లపాడు - ఓబులాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి, కొల్లేరుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో ఆలపాడు-గుండుగొలనుల మధ్య రాకపోకలు నిలి చాయి. శ్రీపర్రు వద్ద తమ్మిలేరు, బుడమేరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో కైక లూరు-ఏలూరు మధ్య రాకపోకలు నిలిచాయి. మచిలీపట్నంలో ప్రధాన రహదారు లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.
10, 221 హెక్టార్లలో పంటల మునక
జిల్లాలో 2.34 లక్షల హెక్టార్లలో వరి, 46 వేలహెక్టార్లలో పత్తి, 12వేల హెక్టార్లలో మిర్చి, 3.31 లక్షల హెక్టార్లలో పలు రకాల పంటలు సాగయ్యాయి. భారీ వర్షాల కార ణంగా జిల్లాలో మంగళవారం నాటికి 10,221 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవ సాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మినుము 740, పత్తి 4331, మొక్కజొన్న 866, వరి 4284 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
పత్తికి అధిక నష్టం
పశ్చిమ కృష్ణాలో 46 వేల హెక్టార్లలో పత్తిసాగు చేశారు. వారం రోజుల్లో పత్తి మొద టితీత ప్రారంభం కానున్న తరుణంలో భారీ వర్షాలు మొత్తాన్నీ ముంచేశాయి. ఈ ఏడాది పత్తి పూత, పిందె ఆశించిన మేర ఉందని, ఎకరానికి సరాసరిన 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించామని రైతులు అంటున్నారు. వర్షాల కారణంగా పది క్వింటాళ్లకు దిగుబడి పడిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది. మిర్చి పొలాలనూ వర్షం దెబ్బతీసింది. ఈత, పొట్ట దశలో ఉన్న వరి నేలవాలిపోయింది.
15 ఏళ్ల తరువాత అతి భారీవర్షం
2004 తరువాత జిల్లాలో ఎప్పుడూ కురవనంతగా మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది. విస్సన్నపేటలో అత్యధికంగా 192.2మి.మీ., ఘంటసాలలో అత్య ల్పంగా 8.4మి.మీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 97.1మి. మీటర్లు నమోదైంది. నూజివీడులో 184.8, పెనుగంచిప్రోలులో 175.4, వత్సవాయి లో 172.2, బాపులపాడులో 167.4, కైకలూరులో 151.2, కలిదిండిలో 150.8, తిరు వూరులో 147.4, గంపలగూడెంలో 145.2, గన్నవరంలో136.2, చాట్రాయిలో 128.6, గుడివాడలో 127.2, పెదపారుపూడిలో 125.8, మండవల్లిలో 120.6, రెడ్డిగూడెంలో 120.4, ముదినేపల్లిలో 117.4, ముసునూరులో 109.2, ఏ-కొండూరులో 102.8, వీరుల పాడులో 101.4, నందివాడలో 100, చందర్లపాడులో 92.6, పెనుమలూరులో 91.6, కంచికచర్లలో 90.4, ఆగిరిపల్లిలో 90.2, ఉంగుటూరులో 87.2, బంటుమిల్లిలో 85.4, పెడనలో 84.8, గుడ్లవల్లేరులో 82.2, నందిగామలో 76.8, మచిలీపట్నంలో 71.2, గూడూరులో 70.4, జగ్గయ్యపేటలో 68.6, పామర్రులో 68.4, కంకిపాడులో 65.2, ఉయ్యూరు 65.2, పమిడిముక్కలలో 50.8, తోట్లవల్లూరులో 48.4, కృత్తివెన్నులో 44.6, మొవ్వలో 42.2, చల్లపల్లిలో 28.4, మోపిదేవిలో 27.4, కోడూరులో 26.2, అవనిగడ్డలో 22.4, నాగాలయంకలో 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొటికలపూడి వాగులో యువకుడి గల్లంతు
కొటికలపూడి ఏనుగడ్డ వాగులో కొత్తపల్లి నవీన్ (28) అనే యువకుడు గల్లంతయ్యాడు. మైలవరం మండలం గణపవరానికి చెందిన నవీన్ పెదలంకలో బంధువుల ఇంట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వ్యవసాయ పనులు నిమిత్తం వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మృతదేహం కోసం గాలిస్తున్నారు.