జిల్లా జలమయం

ABN , First Publish Date - 2020-07-20T10:30:04+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం

జిల్లా జలమయం

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం/మచిపట్నం టౌన్‌ : జిల్లావ్యాప్తంగా ఆదివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.   విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కైకలూరులో భారీ వర్షం కురిసింది.  కైకలూరులో 35.2, మండవల్లిలో 4.2, గంపలగూడెంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ ముంపునకు గురయ్యాయి. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.


గుడివాడ(రాజేంద్రనగర్‌) : ఆదివారం కురిసిన వర్షానికి గుడివాడ ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


కైకలూరు : కైకలూరు ప్రాంతంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కైకలూరు- కలిదిండి రహదారిలో నీళ్లు నిలిచిపోయాయి. వెలమపేట, ఆచవరం బీసీ కాలనీ, అగ్రహారం రహదారి పూర్తిగా నీటమునిగాయి. వరిచేలు నీటిలో తేలుతూ కన్పించాయి.


విజయవాడ : భారీ వర్షాలకు నగరం ముంపునకు గురైంది. నాలుగు రోజులుగా ఏదో ఒక పూట వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కురిసిన భారీ వర్షంతో నగరం జలమయమైంది. చిన్నచిన్న చినుకులకే నీళ్లతో నిండిపోతున్న రహదారులు ఈ భారీ వర్షానికి మరీ అధ్వానంగా మారిపోయాయి. తాజాగా కురుస్తున్న వర్షాలకు రామలింగేశ్వరనగర్‌ ప్రధాన రహదారి (కరకట్ట మార్గం) కుంగిపోయింది.


స్ర్కూబ్రిడ్జి దాటిన తర్వాత ఉన్న ప్రవేశమార్గం వద్ద రహదారిపై పెద్ద గొయ్యి పడింది. దీంతో ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులకు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. కబేళా, ఊర్మిళానగర్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఉదయం నుంచీ వర్షం కురుస్తుండడం, మరోపక్క కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-07-20T10:30:04+05:30 IST