మురిసేటి.. మొవ్వ!

ABN , First Publish Date - 2020-11-26T06:02:56+05:30 IST

బ్రిటన్‌లో ప్రతిష్టాత్మక ఎన్‌హెచ్‌ఎస్‌ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారానికి తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావు ఎంపికవడంతో మొవ్వ గ్రామం మురిసిపోతోంది.

మురిసేటి.. మొవ్వ!
ఘట్టమనేని హనుమంతరావు

ఘట్టమనేని హనుమంతరావు బ్రిటన్‌లో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికపై గ్రామస్తుల హర్షం

కూచిపూడి, నవంబరు 25: బ్రిటన్‌లో ప్రతిష్టాత్మక ఎన్‌హెచ్‌ఎస్‌ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారానికి తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావు ఎంపికవడంతో మొవ్వ గ్రామం మురిసిపోతోంది. తమ గ్రామ వాసికి గొప్ప పురస్కారం దక్కడంతో హనుమంతరావు కుటుంబ సభ్యులతోపాటు ఆయనతో అనుబంధం ఉన్నవారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మొవ్వకు చెందిన ఘట్టమనేని లక్ష్మీనారాయణ - లలితాంబ దంపతులకు నాలుగో సంతానం హనుమంతరావు. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. సోదరుడు లక్మీప్రసాద్‌ విజయవాడలో ప్రముఖ వైద్యులుగా సేవలందించారు. సోదరీమణులు ఘట్టమనేని లీలా, హేమలత కూడా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. హనుమంతరావు 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు మొవ్వ మండవ కనకయ్య జిల్లా పరిషత్‌ పాఠశాలలోనూ, పీయూసీ విజయవాడ లయోలా కళాశాలలోనూ పూర్తి చేశారు. కర్నూలులో మెడిసిన్‌, చండీఘర్‌లో పీజీ పూర్తి చేసి నాలుగున్నర దశాబ్దాలుగా లండన్‌లో వైద్యసేవలందిస్తున్నారు.

సేవ చేయాలనే తపన 

 హనుమంతరావు ప్రతిష్టాత్మక ఎన్‌హెచ్‌ఎస్‌ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక కావటం చాలా ఆనందంగా ఉందని ఈయన సోదరి ఘట్టమనేని లీలా తెలిపారు. చిన్నతనం నుంచి సేవ చేయాలనే తపన హనుమంత రావుకు ఎక్కువనీ, విద్యలో చురుగ్గా ఉండేవారనీ ఆమె తెలిపారు.  

తెలుగువాళ్లకు గర్వకారణం  

  హనుమంతరావు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక కావటం తెలుగు వాళ్లకు గర్వకారణమని ఆయన బావ బోయపాటి రామమోహనరావు  పేర్కొన్నారు. హనుమంతరావు మంచి మేధావి అని కొనియాడారు.

చదువులో ఎంతో చురుకు

మొవ్వ వాసి తాతినేని పూర్ణచంద్రరావు స్పందిస్తూ తెలుగువారందరికీ ఆనందించదగ్గ విషయమని మొవ్వ గ్రామస్తుడిగా, విద్యలో తనకు జూనియర్‌గా మొవ్వ జడ్పీ పాఠశాలలో హనుమంతరావు విద్యనభ్యసించారని, చదువులో చురుగ్గా ఉండేవారని అన్నారు.

Updated Date - 2020-11-26T06:02:56+05:30 IST