వైభవంగా నాంచారమ్మ జాతర ప్రారంభం
ABN , First Publish Date - 2020-03-08T11:56:03+05:30 IST
విశ్వనాథపల్లి గ్రామంలో భక్తుల పూజలందుకుంటున్న అద్దంకి నాంచారమ్మ వార్షిక జాతర శనివారం వైభవోపేతంగా ప్రారంభమైంది. రెండు

విశ్వనాథపల్లి (కోడూరు): విశ్వనాథపల్లి గ్రామంలో భక్తుల పూజలందుకుంటున్న అద్దంకి నాంచారమ్మ వార్షిక జాతర శనివారం వైభవోపేతంగా ప్రారంభమైంది. రెండు రోజులుగా జరిగే ఈ జాతరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న ముందస్తు అంచనాలతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కృష్ణానది వద్ద పుణ్యస్నానాలు ఆచరించే చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం రాత్రి జాతరకు సుమారు లక్ష మందికిపైగా భక్తులు వస్తారన్న అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల పూలమాలలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్శనానికి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. చిన్న అమ్మవారు వి.కొత్తపాలెం గ్రామంలో గ్రామోత్సవాన్ని ముగించుకుని గాబ గ్రామోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా స్నానాల ఘాట్ వద్ద సీఐ బి.బి.రవికుమార్, ఎస్సై పి.రమేష్, ఆలయ ఈవో ఆంజనేయస్వామి, తహసీల్దార్ ఎస్‌కె.లతీఫ్‌పాషా ఏర్పాట్లు పర్యవేక్షించారు.