పేదల పొట్టకొడుతున్న ప్రభుత్వం: టీడీపీ

ABN , First Publish Date - 2020-03-02T10:05:55+05:30 IST

పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అదే పేదల పొట్ట కొడుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల పొట్టకొడుతున్న ప్రభుత్వం: టీడీపీ

అవినగడ్డ టౌన్‌, మార్చి 1: పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అదే పేదల పొట్ట కొడుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలి బుద్దప్రసాద్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వం తీరు ఇల్లు పీకి పందిరేసిన చందాన తయ్యారయిందని విమర్శించారు. గడిచిన కొద్ది నెలల కాలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 6.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వారిని మోసం చేసిందని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు గృహ నిర్మాణ బకాయిలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి  ఎందుకు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణం పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న చిన్న చిన్న కమతాలుగా ఉన్న పోరంబోకు భూములను స్వాధీనం చేసుకుని రైతుల పొట్ట కొడుతోందని, వాటిని స్వాధీనం చేసుకోవటంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గతంలో 2.5 సెంట్ల భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇస్తే ప్రస్తుతం 1.5 సెంట్లు మాత్రమే ఇస్తారంటున్నారని అది కూడా ఊరికి దూరంగా ఇవ్వటం వల్ల ఏంలాభం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని అందులో భాగంగానే విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డగించి దౌర్జన్యం చేశారని  విమర్శించారు. యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బచ్చు రఘునాథ్‌, రత్తయ్య, మురళీ మోహన్‌ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T10:05:55+05:30 IST