రికార్డులు ‘జై’హో!

ABN , First Publish Date - 2020-11-06T16:12:46+05:30 IST

మూడేళ్ల వయసున్న చిన్నారులకు..

రికార్డులు ‘జై’హో!

ఘంటసాలకు చెందిన మూడేళ్ల బాలుడి అపార ప్రతిభ

195 దేశాల జాతీయ జెండాలు గుర్తింపు

మూడు భాషల్లో అక్షరాలను చదివేస్తాడు 

ప్రపంచ పటంలో 18 దేశాలను చెప్పేస్తాడు

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ల్లో స్థానం దక్కించుకున్న చిచ్చరపిడుగు


ఘంటసాల(కృష్ణా): మూడేళ్ల వయసున్న చిన్నారులకు ఏం ప్రతిభ ఉంటుంది? అమ్మ ఎవరు అని అడిగితే చూపిస్తారు. నాన్న ఎక్కడ అంటే ఠక్కున చెప్పేస్తారు. రోజూ చూసే కుటుంబ సభ్యులను గుర్తిస్తారు. చేతికి అందిన వస్తువులతోనూ, బొమ్మలతోనూ ఆడుకుంటారు. అంతకుమించి ఏమైనా చేస్తే ఆ చిన్నారిని గడుగ్గాయ్‌ అంటాం. పీజీలు, పీహెచ్‌డీలు చేసినవారు చెప్పలేనివి సైతం  మూడేళ్ల వయసులోనే చెప్పేస్తే.. మహా మేధావులు సైతం గుర్తించలేనివి టకటకా చూపిస్తే.. ఆ మేధస్సుకు ఎవరైనా తలవంచాల్సిందే. అవును! జిల్లాలోని ఘంటసాలకు చెందిన వేమూరి జై తన అద్భుత ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. కరోనా కాలంలో అమెరికా నుంచి నానమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చి ఆ సమయంలో నేర్చుకొని సాధించిన విజయమిది. అదేంటో.. అదెలాగో.. మీరే చదవండి.


ఘంటసాల గ్రామానికి చెందిన వేమూరి వెంకటేశ్వరరావు, స్వరూపరాణిల కుమారుడు డాక్టర్‌ వేమూరి ప్రవీణ్‌ కుమార్‌ దంపతులు వైద్యులుగా అమెరికాలోని సౌత్‌ కరోలినాలో పని చేస్తున్నారు. వారి కుమారుడే మూడేళ్ల వేమూరి జై. కరోనా ప్రభావం ప్రపంచంపై ఇంకా మొద లుకాక ముందు జనవరిలో జైను తల్లిదండ్రులు ఘంటసాల గ్రామానికి తీసుకొచ్చారు. బాలుడి తాతయ్య, నానమ్మల దగ్గర వదిలి అమెరికాకు వెళ్లిపోయారు. ఇక్కడ ఉన్న ఆరేడు నెలల కాలంలోనే చూసింది చూసినట్లుగా పట్టేస్తూ ఉండటంతో అతనిలోని ప్రతిభను గుర్తించిన నానమ్మ స్వరూపరాణి జైకు నిదానంగా శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టింది. మొదట్లో ఇంట్లో అందుబాటులో ఉన్న ప్రపంచ పటాన్ని చూపిస్తూ దేశాలను గుర్తుపట్టటం నేర్పించింది. వెంటనే ఆకళింపు చేసుకొని ఎలా అడిగినా టకటకా జవాబులు చెప్పేస్తూ ఉండటంతో అమెరికా నుంచి ప్రత్యేకంగా వివిధ దేశాల జెండా కార్డులను తెప్పించి వాటిని గుర్తించటం నేర్పారు.


నానమ్మ స్వరూపరాణి, తాతయ్య వెంకటేశ్వరరావు ఇచ్చిన శిక్షణతో జై 195 దేశాల జాతీయ జెండాలను గుర్తించటంతో పాటు కెమిస్ట్రీలోని ఎలిమెంట్లను, ప్లానెట్‌లను గుర్తించటం, ఇంగ్లీషులో చిన్న చిన్న పదాలను చదవటం, హిందీ, తెలుగు అక్షరాలను చదవటం, తెలుగు న్యూస్‌పేపర్‌లోని హెడ్డింగ్‌లను చదువుతూ ఉండటంతో ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జై తల్లిదండ్రులు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి తెలిపారు. వారు పెట్టిన పరీక్షలో 112 దేశాల జాతీయ జెండాలను తడుముకోకుండా టకటకా చెప్పటంతో పాటు పీరియాడిక్‌ టేబుల్‌లోని 40 ఎలిమెంట్లనూ, ప్రపంచ మ్యాప్‌లోని 18 దేశాలనూ గుర్తించి ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు పదాలను చదివి వారిని అబ్బురపరిచాడు. అక్టోబరులో అమెరికా వెళ్లిన జై సౌత్‌ కరోలినాలో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు పెట్టిన పరీక్షలో నెగ్గి సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌గా అవార్డు సాధించాడు.  


ఆంధ్రజ్యోతి పత్రిక, బంగ్లాదేశ్‌, భారత్‌ జెండాలంటే మక్కువ 

ప్రపంచంలోని అన్ని దేశాల జెండాలను గుర్తించే జై అన్ని జెండాలకంటే ఎక్కువగా ఇష్టపడే జెండాలు బంగ్లాదేశ్‌, భారత్‌ జెండాలైతే,  దిన పత్రికల్లో ఎన్ని పత్రికలు ముందు పెట్టినా పట్టుకొనేది మాత్రం ఆంధ్రజ్యోతి దినపత్రికనే. ఆంధ్రజ్యోతి బ్యానర్‌ను చదివి ఆ తర్వాత పెద్దగా ఉండే ప్రధాన శీర్షికలను కూడబలుక్కుని చదివే జై అల్లరిలోనూ ఇతర పిల్లలకు ఏమాత్రమూ తీసిపోడు. ఆవరణ మొత్తం గెంతుతూ ఆవరణలో నిలిపి ఉంచిన వాహనాలపై ఎగబాకుతూ, ఇంటికి వచ్చిన వారిని కొత్తాపాత లేకుండా నవ్వుతూ పలకరిస్తూ వారిని తన టాలెంట్‌తోనూ, అల్లరితోనూ ముగ్దుల్ని చేస్తాడు. అమెరికాలో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్న జై తండ్రి డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కూడా బాల్యంలో ఇదే రీతిన అద్భుత జ్ఞాపకశక్తి కలిగి ఉండేవాడని జై తాత వేమూరి వెంకటేశ్వరరావు తెలిపారు.  Updated Date - 2020-11-06T16:12:46+05:30 IST