పేదలకెంత కష్టం!

ABN , First Publish Date - 2020-11-25T06:11:07+05:30 IST

పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది..

పేదలకెంత కష్టం!
కొవిడ్‌ సెంటర్‌గా ఉన్న ప్రభుత్వాసుపత్రి

సాధారణ వ్యాధులకు వైద్యం కరువు

కొవిడ్‌ సేవలకే జీజీహెచ్‌

పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షేనా? 

జీజీహెచ్‌లో బాగా తగ్గిపోయిన కేసులు 

సాధారణ వైద్య సేవలు ప్రారంభిస్తేనే మేలు  


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. అందరికీ అందుబాటులో ఉండే విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రి (స్టేట్‌ కొవిడ్‌ ట్రీటింగ్‌ సెంటర్‌)గా మార్చేయడంతో ఎనిమిది నెలలుగా జిల్లాలోని సాధారణ రోగులకు ప్రభుత్వ వైద్యసేవలు అందడం లేదు. పేదలు కడుపు నొప్పి వచ్చినా.. కాలు నొప్పి వచ్చినా.. వైద్యం అందుబాటులో లేకపోవడంతో మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అనారోగ్యం చుట్టుముడితే జిల్లాలో ఎక్కడా ప్రభుత్వపరంగా సరైన వైద్యసేవలందడం లేదు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు అత్యంత ఖరీదైపోయాయి. ప్రైవేటు వైద్యానికి రూ.లక్షల్లో వెచ్చించలేని రోగులకు ప్రభుత్వ వైద్యం సైతం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో అనారోగ్యం పాలవుతున్న పేదల పరిస్థితి దుర్భరంగా మారింది. 


విజయవాడలో ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 1050 పడకలతో బోధనాసుపత్రిగా కొనసాగుతున్న కొత్త ప్రభుత్వాసుపత్రి జిల్లాలోని పేదలందరికీ ఉచితంగా వైద్య సేవలందిస్తోంది. పొరుగున ఉన్న పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి కూడా ప్రతిరోజూ దాదాపు రెండు వేల మంది రోగులు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చేవారు. మార్చి నెలలో కరోనా అలజడి మొదలైన వెంటనే కొత్త ప్రభుత్వాసుపత్రిని, అదే ఆవరణలో అత్యాధునిక వసతులతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేయడంతో సాధారణ రోగులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. సాధారణ రోగులకు నగరంలోని పటమట, కొత్తపేట, రాజీవ్‌నగర్లలో ఉన్న పట్టణ కుటుంబ ఆరోగ్య కేంద్రాలలోనూ, బస్టాండ్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనంగా ఒక ప్రత్యేక అల్లోపతి డిస్పెన్సరీని ఏర్పాటు చేసి.. ఓపీ వైద్యసేవలను కొనసాగించాలని వైద్యాధికారులు భావించినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు.


తర్వాత రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలను కొనసాగించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ.. అక్కడ తగిన వసతి సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు. చివరికి కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి అతి సమీపంలోనే ఉన్న ఈఎస్‌ఐ ఆసుపతిల్రో తాత్కాలిక ప్రాతిపదికన సాధారణ రోగులకు ఓపీ సేవలను ప్రారంభించారు. ఇక్కడ సర్జరీ, మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌ విభాగాలతోపాటు అత్యవసర వైద్యసేవలను సైతం అందించేందుకు 24 గంటలూ పనిచేసే క్యాజువాలిటీ, రెండు మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్లను కూడా ఈఎస్‌ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించేందుకు తగినంతమంది డాక్టర్లు, సిబ్బంది, ఫార్మాసిస్టులను కొత్త ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచే కేటాయించారు. కానీ ఇక్కడ అందిస్తున్న వైద్యసేవలు మొక్కుబడిగా మారడంతో రోగులు రావడమే మానేశారు. 


గుంటూరు వెళ్లాల్సిందే

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు అందిస్తున్నారని వెళుతున్న రోగులకు అక్కడ వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న అనారోగ్యంతో వెళ్లినా మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరికైనా ఎమెర్జెన్సీ వైద్యసేవలు, శస్త్రచికిత్సలు చేయాల్సిన పరిస్థితులు ఎదురైతే వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెప్పినప్పటికీ.. అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే రవాణా ఖర్చులే తడిసిమోపెడవుతాయి. అసలే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలు చేతిలో చిల్లిగవ్వ లేక నిస్సహాయ స్థితిలో ఉసూరుమంటూ ఇంటికి వెళ్లిపోతున్నారు. కొంతమంది అప్పో సప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుందామంటే.. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఓపీ సేవలను నిలిపివేశారు. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రావాలంటే పేదలకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎక్కువ మంది రోగులు మెడికల్‌ షాపులపైనే ఆధారపడుతున్నారు. బీపీ, షుగరు, గుండె, తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు గతంలో ఎప్పుడో వైద్యులు రాసిచ్చిన మందులనే మెడికల్‌ షాపుల నుంచి తెచ్చుకుని వాడుతున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వం వెంటనే పేదలకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు. 


కొవిడ్‌ ఆసుపత్రిలో రోగులు 200 మందే..  

ఎనిమిది నెలలుగా స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా కొనసాగుతున్న విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం కరోనా బాధితులు 211 మందే చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ, క్యాజువాలిటీ, సెంట్రల్‌ డయాగ్నొస్టిక్స్‌ బ్లాక్‌లతోపాటు ఇటీవలే కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ను కూడా కరోనా బాధితులకే వినియోగించేవారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఐసీయూలతోపాటు ఆసుపత్రిలోని ఇతర విభాగాల వార్డులలో మొత్తం 533 పడకలు ఉండగా.. సోమవారం నాటికి ఐసీయూల్లో 94 మంది, సాధారణ ఐసోలేషన్‌ వార్డుల్లో 117 మంది కలిపి మొత్తం 211 మంది మాత్రమే కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మిగిలిన 322 పడకలు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బాధితుల సంఖ్య ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యాధికారులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ 2వేల మంది ఔట్‌ పేషెంట్లకు, వెయ్యి మందికి పైగా ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలందించే కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో తిరిగి సాధారణ వైద్యసేవలను ప్రారంభిస్తే పేదలకు ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ఎక్కువ మందికి మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Read more