గన్నవరం గరంగరం

ABN , First Publish Date - 2020-07-19T17:24:25+05:30 IST

గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి..

గన్నవరం గరంగరం

ఎమ్మెల్యే వంశీ వర్సెస్ దుట్టా వర్గం

దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి హల్‌చల్

వంశీ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తూ ప్రత్యేక భేటీలు

అధికారులపైనా ఆయనదే పెత్తనం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు వర్గం మధ్య ఆధిపత్య పోరు ఆది నుంచి కొనసాగుతోంది. తాజాగా దుట్టా అల్లుడు, వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్‌రెడ్డి రాకతో నియోజకవర్గంలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.


గన్నవరం రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్‌ గెలుపొందారు. గెలిచిన కొద్దినెలలకే ఆయన వైసీపీ గూటికి చేరారు. రాష్ట్రంలో టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన తొలి ఎమ్మెల్యే ఈయనే. దీంతో పార్టీలో మంచి ఆదరణే లభిస్తుందని అంతా భావించారు. కానీ, తాజాగా నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు వంశీ వర్గీయుల్లో అసహనాన్ని రేపుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ పదవి ఇవ్వడంతో ఆయన నియోజకవర్గంలో జెండా పీకేశారు. దీంతో వంశీకి ఎదురులేకుండా పోతుందని అంతా భావించారు. కానీ..


దుట్టా.. అడ్డుకట్ట..

రాజకీయంగా తెరమరుగైన దుట్టా వర్గం తిరిగి స్థానిక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో వైసీపీలో ఆధిపత్య పోరుకు తెరలేచింది. దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి ప్రవేశంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. 2019 వరకు శివభరత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వైసీపీ వైద్యవిభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన హైదరాబాద్‌లో వైద్యవృత్తిలో ఉంటూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన వైద్యవృత్తిని వీడి గన్నవరం చేరుకున్నారు. రావడంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైసీపీ గూటికి చేరిన వంశీ.. టీడీపీలో తన వెంట ఉన్న వర్గాన్ని తనతో పాటు వైసీపీలోకి తీసుకొచ్చారు. యార్లగడ్డ వర్గంగా ఉన్నవారూ వంశీకి చేరువయ్యారు. అయితే, తొలి నుంచీ వైసీపీలో ఉన్న ఓ వర్గం మాత్రం వంశీని ఆదరించలేదు. వీరిని లక్ష్యంగా చేసుకుని శివభరత్‌రెడ్డి పావులు కదిపారు. వైసీపీలో ఉంటూ తన మాట వినని వారిని లాక్కొచ్చారు. తాను జగన్‌, ఆయన సతీమణి భారతికి బంధువునని, తనకు సీఎంతో సాన్నిహిత్యం ఉందని చెబుతూ బెదిరించి తన వైపునకు తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. ఈ పరిణామాలు వంశీ వర్గంలో తీవ్ర అసహనాన్ని రేపాయి. 


పట్టుబిగిస్తున్న శివభరత్‌రెడ్డి

నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్న శివభరత్‌ రెడ్డి ఇటు పార్టీతో పాటు అధికారులపైనా పట్టు బిగిస్తున్నారు. ఇళ్ల స్థలాల భూసేకరణ, కాంట్రాక్టులు, గ్రావెల్‌ రవాణా, అధికారులను బెదిరింపులకు గురి చేయడం వంటివాటిలో శివభరత్‌రెడ్డి దూకుడుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాట తీరుపైనా విమర్శలు ఉన్నాయి. తన మాట వినని పార్టీ నాయకులను పరుషపదజాలంతో దూషిస్తున్నారని అంటున్నారు. అధికారులపైనా అదే జులుం ప్రదర్శిస్తుండటంతో వారు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జిగా తనను నియమించాలని శివభరత్‌రెడ్డి వైసీపీ అధిష్ఠానం వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం. 


వైఎస్ జయంతిలో బట్టబయలు

గన్నవరంలో ఈనెల 8న వైఎస్ జయంతిని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ, దుట్టా వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా కేకులు కట్ చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం చేశారు. ముస్తాబాదలో దుట్టా వర్గం నిర్వహించిన కార్యక్రమంలో శివభరత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శివభరత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఆయన వర్గీయులు వంశీ వర్గీయులపై దాడికి యత్నించారన్న ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-07-19T17:24:25+05:30 IST