-
-
Home » Andhra Pradesh » Krishna » ganjai
-
గంజాయి గ్యాంగ్
ABN , First Publish Date - 2020-11-21T06:17:07+05:30 IST
డాన్.. బాస్.. కింగ్.. ఇవన్నీ సినిమా పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు గంజాయి గ్యాంగ్‌ల్లోకి వచ్చి చేరాయి.

వీళ్లకు లీడర్ డాన్
అందరూ యువకులే
కళాశాలల విద్యార్థులే ఎక్కువ
ఐదారుగురికి ఒక డాన్
సంభాషణ మొత్తం ఆ పదంతోనే
డాన్.. బాస్.. కింగ్.. ఇవన్నీ సినిమా పేర్లు. ఇప్పుడు ఈ పేర్లు గంజాయి గ్యాంగ్‌ల్లోకి వచ్చి చేరాయి. గ్యాంగ్ అంటే ఇక్కడ గంజాయిని సరఫరా చేసే మాఫియా కాదు.. ఈ మత్తుకు బానిసలవుతున్న యువత. వీరంతా గ్యాంగ్‌లను కూడగడు తున్నారు. వీరిలో అత్యధికులు విద్యార్థులే. ఒక్కో గ్యాంగ్‌కు ఒక్కో యువకుడు తనను తానే నాయకుడిగా ప్రకటించుకుంటాడు. అతడే డాన్. అతని మాటే అందరూ వినాలి. అతడు అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే వేధింపులు మొదలవుతాయి. గంజాయిని ఎక్కువగా ఉపయోగించే యువతలో ఈ ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి అటు పోలీసులను, ఇటు తల్లిదండ్రులను కలవరపెడుతోంది.
ఆంధ్రజ్యోతి - విజయవాడ : నగరంలో గంజాయికి అలవాటు పడిన యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడి, తమకు సరుకును అందించే యువకుడిని డాన్, బాస్, కింగ్ అని పిలుచుకుంటున్నారు. రామవరప్పాడు హనుమాన్‌నగర్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటనకు ‘డాన్’ వేధింపులే కారణమని తేలింది. ఈ ఘటనతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇప్పటి వరకు రెండు దఫాలుగా 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చదువు మధ్యలో ఆపేసిన వారితోపాటు వివిధ కళాశాలల విద్యార్థులూ ఉన్నారు. వారికి టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారిని విచారిస్తుంటే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే డాన్, బాస్, కింగ్ వంటి పేర్లు వెలుగులోకి
వచ్చాయి.
విస్తరిస్తున్న వ్యసనం
గంజాయికి ఎక్కువగా అలవాటు పడిన వారిలో పోలీసులు ఇటీవల కొద్దిమందిని గుర్తించారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. వారంతా విజయవాడ చుట్టుపక్కల ఐదు కళాశాలల్లో చదువుతున్నవారే. విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, పాతబస్తీ, వెటర్నరీ కాలనీ, ఇబ్రహీంపట్నం, నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో పేరున్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గంజాయి మత్తులో ఎక్కువగా జోగుతున్నారని తేలింది. ఇప్పటికే నగరంలోని అత్యధిక కళాశాలల్లో విద్యార్థులు గంజాయికి అలవాటుపడినట్టు గుర్తించారు. ఇప్పుడు మరికొన్ని కళాశాలలకు కూడా ఇది విస్తరించిందని తాజాగా పోలీసుల పరిశీలనలో వెల్లడయింది. గంజాయికి అలవాటు పడిన యువకులు ఒకరిని డాన్‌గా వ్యవహరించడం, ఆ విధంగా పిలిపించుకోవడం, ఆ డాన్ మిగిలిన యువకుల నుంచి డబ్బులు లాక్కోవడం వంటి ధోరణులు ఇప్పుడు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు విజయవాడకే పరిమితమైందనుకున్న గంజాయి కిక్కు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. పోలీసుల విచారణలో ఈ కొత్త సమాచారం తెలిసింది. దీనిని కట్టడి చేయడం ఎలాగో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఆ రోజు జరిగిందిదీ...
కొద్దిరోజుల క్రితం రామవరప్పాడు హనుమాన్‌నగర్‌లో ముగ్గురు యువకులు నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి తాగుతున్నారు. ఇద్దరి మధ్య వివాదం రేగడంతో ఒక యువకుడు మరో యువకుడి గొంతు కోసేశాడు. ఇందులో గాయపడిన యువకుడి వయస్సు 19 ఏళ్లు. బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడి వయస్సు 16 ఏళ్లు. ఈ దాడి వెనుక మత్తు కిక్ ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటే. సినిమాల్లో విలన్ తన అనుచురులను ఎలా ఏడిపిస్తాడో అలాంటి ధోరణులే ఈ దాడిలో ఉన్నాయి. గుణదలకు చెందిన లిఫ్ట్ మెకానిక్ పేరం సాయి సురేందర్ గంజాయికి అలవాటు పడ్డాడు. తరువాత తన ఇంటి సమీపంలో ఉండే 16 ఏళ్ల అబ్బాయికి గంజాయి రుచి చూపించాడు. ఇలా ఒక్కొక్కరికీ గంజాయిని అలవాటు చేస్తూ, ప్రత్యేకంగా ఒక గ్రూపును తయారు చేశాడు. వాళ్లందరికీ సాయి సురేందర్ గంజాయిని అందజేసేవాడు. వారిలో 16 ఏళ్ల బాలుడి తాతయ్య సెలూన్ నిర్వహిస్తున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదివి మానేసిన ఆ బాలుడికి సెలూన్ బాధ్యతలను అప్పగించాడు. సాయి సురేందర్ తాను తయారు చేసిన మత్తు గ్యాంగ్‌కు తననే డాన్‌గా ప్రకటించుకున్నాడు. తనను అందరూ పేరుతో కాకుండా డాన్ అని పిలవాలని చెప్పాడు. అలా పిలవని వాళ్లకు టార్చర్ చూపించేవాడు.
శ్రమ అతడిది.. డబ్బులు డాన్‌కి...
సాయి సురేందర్ నుంచి సెలూన్ నడుపుతున్న బాలుడు గంజాయి తీసుకునేవాడు. వారంలో కనీసం ఐదారు సార్లు గంజాయి కిక్ చూడకపోతే నిద్ర పట్టలేని స్థితికి బాలుడు చేరిపోయాడు. ఈ బాలుడికి గంజాయిని సరఫరా చేసే సాయి సురేందర్ అతడు సంపాదించిన మొత్తాన్ని లాగేసుకునేవాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే తాను డాన్‌నని చెప్పేవాడు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఎక్కడ గంజాయి డెన్ ఏర్పాటు చేసుకున్నా, మిగిలిన వాళ్లంతా సాయి సురేందర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ విధంగా బ్యాచ్‌ను తిప్పుకున్నాడు. ఈనెల 15న సాయి సురేందర్, సెలూన్ నడిపే బాలుడితోపాటు మరో యువకుడు గంజాయి తాగడానికి హనుమాన్ నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బాలుడిని సాయి సురేందర్ వేధించాడు. తర్వాత కాసేపటికి సిగరెట్ తీసుకురమ్మని పంపాడు. అప్పటికే విసిగిపోయి, సాయి సురేందర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న బాలుడు సిగరెట్‌తోపాటు బ్లేడ్‌ను వెంట తీసుకొచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా, వెంటనే బాలుడు బ్లేడ్‌తో సాయి సురేందర్ పీక కోసేశాడు.