సమస్యలు మరిచారా?

ABN , First Publish Date - 2020-12-06T06:09:06+05:30 IST

సమస్యలు మరిచారా?

సమస్యలు మరిచారా?

సంక్షేమ సమీక్షకే ప్రాధాన్యం.. అభివృద్ధి అంశాలు శూన్యం 

అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా డీఆర్‌సీ అజెండా

ఎన్నో అపరిష్కృత సమస్యలు

అయినా పట్టించుకోని అధికారులు 

ప్రభుత్వ జోక్యం అవసరం

పరిష్కరిస్తే ఎన్నో ప్రయోజనాలు

రేపు నగరంలో జిల్లా సమీక్ష సమావేశం


సంక్షేమం.. ప్రభుత్వ పనితీరును తెలియజేస్తుంది. 

అభివృద్ధి.. ఆ ప్రాంత స్థితిగతులను వివరిస్తుంది. 

ఎప్పుడూ సంక్షేమ జపంచేస్తే అభివృద్ధి మాటేంటి? అషరిష్కృతంగా ఉన్న సమస్యల సంగతేంటి? ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో ఇబ్బందులకు ఓ దారి చూపించి.. అభివృద్ధిని అందుబాటులోకి తెచ్చేందుకు వేదికగా మారే జిల్లా సమీక్ష సమావేశాన్ని కూడా సంక్షేమ జపంతో నింపేస్తే ఎలా? సోమవారం విజయవాడలో జరిగే డీఆర్‌సీ సమావేశంలో ప్రభుత్వ పథకాల సమీక్షలే తప్ప.. సమస్యల పరిష్కారంపై కనీస అజెండా కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోక జిల్లా ప్రతిష్ఠను వెక్కిరిస్తుండగా, సంక్షేమ పథకాలకు సంబంధించి మమ.. అనిపించే ప్రయత్నం ఎంతవరకు సబబు అనే వాదన వినిపిస్తోంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : చాన్నాళ్ల తర్వాత జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్‌సీ) సోమవారం విజయవాడలో నిర్వహించనున్నారు. సాధారణంగా ఎప్పుడూ బందరులో జరిగే ఈ సమావేశం ఈసారి విజయవాడకు మార్పు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారు. ఈ నేపథ్యంలో తుఫాను, వ్యవసాయ-ఉద్యాన పంటలు,  సంక్షేమ పథకాలకు సంబంధించిన అజెండాను జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తోంది తప్ప.. అభివృద్ధి, ఇతర అపరిష్కృత అంశాలపై కనీసం దృష్టి సారించకపోవటం విమర్శలకు తావిస్తోంది.

జిల్లా సమీక్షా సమావేశం అంటే.. 

జిల్లా సమీక్షా సమావేశం అంటే.. సంక్షేమాభివృద్ధి అంశాలతో పాటు జిల్లాలో వివిధ రంగాల అభివృద్ధికి బీజం వేసే వేదిక.  తుఫాను నష్టాల గురించి చర్చించటం మంచి విషయమే. ఈ పేరుతో పూర్తిగా సంక్షేమ పథకాలనే సమీక్షించుకుంటే అభివృద్ధి, ఇతర అపరిష్కృత అంశాలను విస్మరించటం విడ్డూరమే అవుతుంది. సోమవారం జరిగే సమావేశం అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చివేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో అనేక ముఖ్యమైన అంశాలు పరిష్కారానికి నోచుకోవాల్సి ఉండగా, సంక్షేమ పథకాల టార్గెట్లను సమీక్షించే పద్ధతినే అవలంబించటం సరైనది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఈ సమస్యలకు పరిష్కారమెప్పుడు? 

ఫ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. రన్‌వే విస్తరణ పనులు జరిగినా అందుబాటులోకి రావటానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. స్థానిక రైతుల భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. ఇళ్లకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో కొంత కదలిక వచ్చినా రైతులకు కౌలు చెల్లింపులు, ఇతరత్రా సమస్యలు ఉన్నాయి. రియల్‌ వెంచర్ల భూములను సేకరించిన క్రమంలో వారికి ల్యాండ్‌ టు ల్యాండ్‌ ఇవ్వాలి. ఇంకా అమరావతిలో ప్లాట్లు అందుకోని రైతులు ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు రన్‌వే వెంబడి ఉన్న భూములు విమానాశ్రయ స్వాధీనంలోకి రావు. ఇలా జరిగితే సెక్యూరిటీ ఏరియా పరిధిలోకి నూతన రన్‌వే రాదు. ఇలాంటపుడు భారీ విమానాలు ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉండదు. 

ఫ కొండపావులూరులో కేంద్ర సంస్థలైన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎంల పనులు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర సంస్థలకు ఇప్పటివరకు దారి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. 

ఫ మల్లవల్లిలో  మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌, ఫుడ్‌పార్క్‌ల ప్రధాన మార్గ సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. 

ఫ వీరపనేనిగూడెం ఇండస్ర్టియల్‌ పార్క్‌ మలిదఫా విస్తరణకు సంబంధించి తీసుకోవాల్సిన అంశం అపరిష్కృతంగానే ఉంది. 

ఫ కేసరపల్లిలో మేథ పక్కనే నిర్మిస్తున్న రెండో టవర్‌ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీని భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాలి.

ఫ విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌-65 విస్తరణకు సంబంధించి కొన్నిచోట్ల ఇప్పటికీ భూ సేకరణ సమస్యలు ఉన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

ఫ జక్కంపూడి ఎకనామిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌)సిటీ భవితవ్యం ఏమిటో అర్థంకాని పరిస్థితి. తొలిదశలో నిర్మించిన ఇళ్లలో మౌలిక సదుపాయాలను ఇప్పటివరకు కల్పించలేదు. తగిన బడ్జెట్‌ను ప్రభుత్వమే కేటాయించాలి. 

ఫ నాగాయలంకలో మిస్సైల్‌ పార్క్‌కు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. డీఆర్‌డీవో పరంగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మంత్రి సమక్షంలో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. 

ఫ జిల్లావ్యాప్తంగా పంచాయితీ, ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.  రోడ్ల అభివృద్ధికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన దృష్టి సారించాలి. 

ఫ వెబ్‌ల్యాండ్‌ పనిచేయకపోవటం వల్ల పాసు పుస్తకాలు అందటం లేదు. మ్యుటేషన్లు సరిగ్గా జరగటం లేదు. సబ్‌ డివిజన్స్‌ జరగటం లేదు. సర్వర్‌ సమస్యలతో చౌకడిపోల దగ్గర ప్రజలు  గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

ఫ లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమై ప్రభుత్వానికి ప్రతి పాదించినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఫ నగరంలో గుణదల ఫ్లై ఓవర్‌కు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. భూ సేకరణ చేయాలని తీర్మానించినా సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర పడలేదు. 

ఫ బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌-1కు సంబంధించి సర్వీసు రోడ్డు విస్తరణకు కేంద్రం పరిహారం ఇవ్వటానికి ససేమిరా అంటోంది. ఇక్కడ రిజిస్ర్టేషన్‌ విలువ, మార్కెట్‌ విలువ దాదాపు సమానంగా ఉంది. స్వల్ప పరిహారమే అయినా కేంద్రం తాత్సారం చేస్తోంది.


Read more