నిప్పుతో చెలగాటమా..?

ABN , First Publish Date - 2020-09-12T17:39:36+05:30 IST

హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆసుపత్రి

నిప్పుతో చెలగాటమా..?

హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆసుపత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిమంది అగ్నికి ఆహుతైపోయారు. ఆ హోటల్‌ భవనంలో నిబంధనల ప్రకారం అగ్నిమాపక పరికరాలు లేవని, అత్యవసర ద్వారం కూడా లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని దర్యాప్తు బృందాలు తేల్చాయి. ఈ దుర్ఘటన మరవకముందే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వార్డులో ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.


ఈ నేపథ్యంలో.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు సమీపంలోని ఖమ్మ జిల్లావాసులకు పెద్దదిక్కైన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఏంటి? రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మారాక ఇక్కడ అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారు..? అని ప్రశ్నిస్తే.. ఏ చర్యలు తీసుకోకపోగా, అప్పటికే జరుగుతున్న ఫైర్‌ సేఫ్టీ పనులనే మధ్యలో ఆపేశారన్న సమాధానం వస్తుంది. దీనికి అధికారులు చెప్పే జవాబు ఒకటైతే.. తెరవెనుక కథ మరొకటి..


విజయవాడ, ఆంధ్రజ్యోతి: విజయవాడలో కరోనా బాధితులకు ఉచిత వైద్యసేవలందిస్తూ పేదలకు పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (రాష్ట్రస్థాయి కొవిడ్‌ ట్రీటింగ్‌ సెంటర్‌)లోని పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఆసుపత్రి భవనాల్లో ఎక్కడా నిబంధనల ప్రకారం అగ్నిమాపక పరికరాలు లేవు. ఓపీ, క్యాజువాలిటీ, సెంట్రల్‌ డయాగ్నసిస్‌ సెంటర్లను నిర్వహిస్తున్న మూడు భారీ భవంతుల్లోని పై అంతస్థుల్లో వివిధ విభాగాలకు చెందిన వార్డులున్నాయి. వీటన్నింటినీ ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేయడంతో వాటిలో కరోనా పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఊహించని రీతిలో ఏదైనా అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే తప్పించుకోవడానికి అత్యవసర ద్వారాలు లేవు. పై అంతస్థుల నుంచి మెట్లు దిగి కిందికి రావాల్సిందే. ఈ భారీ భవనాలకు ఒక్కొక్కటి చొప్పున చిన్నచిన్న లిఫ్టులు ఉన్నా సక్రమంగా పనిచేయవని ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి. 


ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ పనులు ఎక్కడివక్కడే..! 

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన వైద్యసేవలందించడం ద్వారా నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) సర్టిఫికెట్‌ సాధించాలని మూడేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మౌలిక సౌకర్యాల కల్పనకు  రూ.16.14 కోట్లతో అంచనాలు రూపొందించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రోగుల భద్రత దృష్ట్యా ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుకు రూ.2.80 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎంఐడీసీ)కు ఈ పనుల బాధ్యతలను అప్పగించారు. వాస్తవానికి 2019, జనవరి 17న పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత రెండు మూడుసార్లు గడువు పొడిగించినా ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. 


80 శాతం పనులు పూర్తి

ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ పనులు రెండేళ్లుగా ఎక్కడివక్కడే ఉన్నాయి. కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆయన దాదాపు ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, క్యాజువాలిటీ, పరీక్షల విభాగాలను నిర్వహిస్తున్న మూడు ప్రధాన భవనాల్లో ఈ ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మూడు భవనాల్లోని దాదాపు అన్ని గదులకు ప్రధాన పైపులు ఏర్పాటు చేశారు. రూ.లక్షల విలువైన అగ్నిమాపక పరికరాలను కొని ఆసుపత్రి ఆవరణలోనే సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఈ పరికరాలన్నీ మూలపడి తుప్పుపట్టిపోతున్నాయి. ఇంతవరకు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పెట్టుబడి పెట్టడానికి తన దగ్గర డబ్బు లేదంటూ కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 


కరోనా బాధితులంతా వృద్ధులే...!

కరోనా బాధితులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆసుపత్రిలో మంచాలు ఖాళీలేక 60 ఏళ్లు పైబడినవారిని, అత్యవసర వైద్యసేవలు అందించాల్సిన వారినే చేర్చుకుంటున్నారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే వృద్ధులైన రోగులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునే సాహసం కూడా చేయలేరు. 

ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాల ఏర్పాటు పనులను త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


కరోనా కారణంగా జాప్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇంకా చిన్నచిన్న పనులు పూర్తిచేసి కనెక్షన్లు ఇవ్వాలి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో పనిచేయడానికి వర్కర్స్‌ భయపడుతున్నారు. ఈ కారణంగానే పనులు ఆలస్యమవుతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో సమస్యలేమీ లేవు. మిగిలిన పనులు కూడా పూర్తి చేయమని కాంట్రాక్టరుకు చెప్పాం. ఒకటి, రెండు నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. 

  • - ప్రవీణ్‌రాజ్‌, ఈఈ, ఏపీఎస్‌ఎంఐడీసీ 

Updated Date - 2020-09-12T17:39:36+05:30 IST