రెవె న్యూకు ‘పట్టా’ స్ర్టోక్‌!

ABN , First Publish Date - 2020-12-29T06:59:29+05:30 IST

జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ రెవెన్యూకు తలబొప్పి కట్టిస్తోంది.

రెవె న్యూకు ‘పట్టా’ స్ర్టోక్‌!

ఒక్క రోజు కార్యక్రమం.. పది రోజుల నిర్వహణ 

ప్రతిరోజూ రూ.లక్షల్లో వ్యయం 

లే అవుట్లను సరి చేసేందుకు అదనపు ఖర్చు 

తలలు పట్టుకుంటున్న అధికారులు


జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ రెవెన్యూకు తలబొప్పి కట్టిస్తోంది. ఒక్కరోజుతో ముగించాల్సిన ఈ కార్యక్రమాన్ని పది రోజులపాటు నిర్వహించడంతో లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.  ఆ భారం మొత్తం రెవెన్యూపైనే పడడంతో తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలను చూస్తే, సొమ్ము రెవెన్యూది.. సోకు అధికార పార్టీది.. అన్నట్టు ఉంది. పంపిణీని ఒకటి రెండు రోజుల్లోనే ముగించే అవకాశం ఉన్నా, ప్రజా ప్రతినిధుల కోసం పదిరోజుల పాటు ఆర్భాటంగా నిర్వహించాల్సి వస్తోంది. దీంతో రెవెన్యూ భారీగా ఖర్చు చేస్తూ, చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం నయా పైసా బడ్జెట్‌ విడుదల చేయలేదు. దీంతో కార్యక్రమ నిర్వహణ భారం మొత్తం రెవెన్యూపైనే పడుతోంది. కార్యక్రమం ఏర్పాటుకు, పట్టాలు ఇచ్చే సమయంలో లే అవుట్లను చదును చేయటానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావటం రెవెన్యూకు తలకు మించిన భారంగా మారుతోంది. 

వాస్తవానికి పట్టాల పంపిణీని ఒకటి రెండు రోజుల్లోనే ముగించవచ్చు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఈ పనిని వేగంగా పూర్తి చేయవచ్చు. కానీ ప్రజా ప్రతినిధులే వీటిని పంపిణీ చేయాలని ఆదేశించటం, దాని నుంచి అధికార పార్టీ ప్రయోజనాన్ని ఆశించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి ఏడో తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రకటించారు. అయితే ఆ తేదీలోగా ముగిస్తారా? అనేది కూడా సందేహమే. 

పెనమలూరు నియోజకవర్గంలో ఇంతవరకు పంపిణీ మొదలే కాలేదు. స్థానిక ఎమ్మెల్యేకు కరోనా రావటంతో ఆయన కోలుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టాల పంపిణీ రెండు రకాలుగా జరుగుతోంది. కొన్ని చోట్ల గ్రామాల వారీగా, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకేచోట జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమానికీ లక్షల్లో ఖర్చవుతోంది. భారీ వేదికలు, కుర్చీలు, సౌండ్‌ సిస్టమ్‌, క్లాత్‌ డెకరేషన్‌, స్నాక్స్‌కు అయ్యే ఖర్చులు ఇందులో ఉన్నాయి. ఈ ఖర్చును భరించేందుకు రెవెన్యూ దగ్గర ప్రత్యేక బడ్జెట్‌ లేదు. జిల్లా యంత్రాంగం నుంచి కూడా నిధుల గురించి స్పష్టత లేదు. దీంతో అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టాల్సి వస్తోందని రెవెన్యూ అధికారులు లబోదిబో మంటున్నారు. 


లే అవుట్ల పునరుద్ధరణ భారమూ రెవెన్యూపైనే.. 

ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన జాప్యం కారణంగా లే అవుట్లలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. సరిహద్దు రాళ్లకు రంగులు పోయాయి. ప్లాట్లలోని మట్టిని తవ్వి రోడ్లుగా పోయడంతో ప్లాట్లలో గుంతలు పడ్డాయి. వీటిని చదును చేసే పని కూడా రెవెన్యూపైనే పడింది. ఈ మొత్తం పనులకు ఎంతలేదన్నా ఒక్కో లే అవుట్‌కు రూ.25 వేలు ఖర్చు అవుతోంది.  

Updated Date - 2020-12-29T06:59:29+05:30 IST