ఇళ్ల యుద్ధం

ABN , First Publish Date - 2020-12-30T06:20:43+05:30 IST

గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి గ్రామంలో ఇళ్లపట్టాల పంపిణీ రసాభాసగా మారింది. ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కారును అడ్డగించడంతో మొదలై, టెంట్ల పీకివేత, పట్టాల తిరస్కరణతో ముగిసింది.

ఇళ్ల యుద్ధం
రహదారిపై అడ్డుగా నిలుచున్న మల్లవల్లి గ్రామస్థులు

పట్టాలను తిరస్కరించిన మల్లవల్లి గ్రామస్థులు

ఎమ్మెల్యే కారును అడ్డుకొని నిరసన

సభా ప్రాంగణంలోని టెంట్ల పీకివేత

ఇతరులకు మల్లవల్లిలో ఇవ్వొద్దంటూ ఆగ్రహం


గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి గ్రామంలో ఇళ్లపట్టాల పంపిణీ రసాభాసగా మారింది. ఇక్కడ  పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కారును అడ్డగించడంతో మొదలై, టెంట్ల పీకివేత, పట్టాల తిరస్కరణతో ముగిసింది. 


హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 29 : మల్లవల్లిగ్రామంలో ఆ గ్రామంతో పాటు మడిచర్ల, బిళ్లనపల్లి, కొత్తపల్లి గ్రామాల వారికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. వాటికి సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మల్లవల్లిలో ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని, వేరే గ్రామస్థులకు మల్లవల్లి భూములను కట్టబెట్టడానికి వీల్లేదంటూ వంశీ వాహన శ్రేణిని వైసీపీ నాయకులు చాకిరి వెంకటనారాయణ, కొండలరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పి, సభా ప్రాంగణానికి చేరుకున్నా, వేరే గ్రామస్థులు తమ గ్రామంలో కూర్చోడానికి వీల్లేదంటూ మరికొందరు గలాటా సృష్టించారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. 20 నిమిషాలకు పైగా తన వాహనంలోనే కూర్చున్న వంశీ చివరికి వెనుదిరుగుతుండగా, చలసాని భోగేశ్వరరావు, ఇతర పెద్దలు సర్దిచెప్పి, ఆయనను సభావేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు, భూమి పోగొట్టుకున్న రైతులకు నష్టపరిహారం ఇప్పించానని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా స్థానికులు వినకపోవడంతో, ఎమ్మెల్యే మైక్‌లోనే అసహనాన్ని వ్యక్తం చేశారు. మల్లవల్లి గ్రామంలోని స్థలాలు బయట వ్యక్తులకు కేటాయించవద్దని, తెల్లరేషన్‌ కార్డుదారులైన 1678 మందికి ఇళ్లస్థలాలు కేటాయించి, పట్టాలు వచ్చిన తర్వాత మాత్రమే అందరం కలిసి తీసుకుంటామంటూ, 500 మంది పట్టాదారులు కూడా తమ ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి నిరాకరించారు. బిళ్లనపల్లి గ్రామంలోని కొందరికి పట్టాలపై సర్వే నెంబరు వేయకపోవడంతో తమకు స్థలం చూపించి పట్టాలు ఇవ్వాలని, లేకపోతే అక్కరలేదని అనడంతో బిళ్లనపల్లిలోనే స్ధలసేకరణ చేసి, వారికి కేటాయించాలని ఎమ్మార్వో నరసింహారావుకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం స్థానిక నాయకులతోనే ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాల పట్టాలను పంపిణీ చేయించారు. సీఐ డి.వి.రమణ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు అదనపు సిబ్బందితో అక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఈ  కార్యక్రమంలో ఏఎమ్‌సీ వైస్‌ చైర్మన్‌ నక్కా గాంధి, రైతు నాయకులు అవిర్నేని శేషగిరిరావు, చెరుకూరి శ్రీనివాస్‌, తానీషా సుంకర బోసు, గణేష్‌, రామాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


దేవరపల్లిలో నిలదీత

తోట్లవల్లూరు : : గత టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు మంజూరైన  117 మందికి పట్టాలు ఇవ్వకపోవడంపై తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను లబ్ధిదారులు నిలదీశారు. తమకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. నాడు 55 మందికి పట్టాలు ఇచ్చారని, మిగిలినవారికి సంక్రాంతిలోపు ఇస్తామని హామీ ఇచ్చారని లబ్ధిదారులు తెలిపారు. అలాగే గుంటూరులో నివసిస్తున్న వారికి, అనర్హులకు స్థలాలు ఇవ్వటాన్ని మరికొందరు ప్రశ్నించారు. ఐలూరులో అనర్హులకు స్థలాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-30T06:20:43+05:30 IST