ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. వ్యాపారుల చేతుల్లో రైతులు విలవిల

ABN , First Publish Date - 2020-12-17T07:05:36+05:30 IST

ఆరుగాలం శ్రమించినా అన్నదాతకు మిగిలింది చివరికి కన్నీళ్లే. చేతికొస్తున్న తరుణంలో పంటను తుఫాను దెబ్బతీసింది

ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. వ్యాపారుల చేతుల్లో రైతులు విలవిల
బందరు మండలం ఆర్‌.గొల్లపాలెం వద్ద ధాన్యం సంచులు కుడుతున్న రైతులు

‘మద్దతు’ ఏదీ?

గత ఏడాది బస్తా ధాన్యం రూ.1340

బీపీటీ 5204 రకం ధాన్యం ధర నేడు రూ.1210

ముతక రకం ధాన్యం బస్తా ధర రూ.1200


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: ఆరుగాలం శ్రమించినా అన్నదాతకు మిగిలింది చివరికి కన్నీళ్లే. చేతికొస్తున్న తరుణంలో పంటను తుఫాను దెబ్బతీసింది. మిగిలిన కాస్త పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా అమలు కావడంలేదు. నివర్‌ తుఫాన్‌ కారణంగా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం సడలించిన నిబంధనలు సైతం ఎక్కడా అమలు కావడంలేదు. ఫలితంగా వ్యాపారులు, మిల్లర్లు నిర్ణయించిన ధరకే రైతులు తమ ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. 


జిల్లా రైతులను ఈ ఏడాది నివర్‌ తుఫాను నిండా ముంచేసింది. మిగిలిన గుప్పెడు గింజలకు మద్దతు ధర లభించడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ధాన్యంలో తేమ శాతం 17 ఉంటే మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. యంత్రాల ద్వారా వరికోతలు పూర్తిచేసిన ధాన్యంలో 25 శాతం వరకు తేమ ఉంటోంది. ఒక్కో పాయింటుకు రూ.20 చొప్పున ధర తగ్గిస్తున్నారు. దీంతో బస్తాకు రూ.140 నుంచి 160 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. గత ఏడాది ఈ రోజుల్లో బీపీటీ 5204 రకం ధాన్యం బస్తా రూ.1340 పలకగా, నేడు రూ.1210 మాత్రమే పలుకుతోంది. ముతక రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర బస్తాకు రూ.1416. నేడు రూ.1200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వరికోతలు, నూర్పిళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యాపారులందరూ కూడబలుక్కుని ధాన్యం ధరలను తొక్కిపెడుతున్నారు. 


యంత్రానికి గంటకు రూ.3.200

వరికోతకు ఎకరానికి రూ.7 వేల నుంచి ఎనిమిది వేల వరకు, కట్టివేతకు ఐదు వేలు, కుప్ప నూర్పిడికి రూ.4వేలు  ఖర్చవుతున్నాయి. కోత, కట్టివేత, కుప్పనూర్పిడికి రూ.15 వేల నుంచి 16 వేల వరకు ఖర్చు అవుతుండటంతో ఖర్చులు తగ్గించుకునేందుకు యంత్రాల ద్వారా వరికోతలు పూర్తి చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో కోత యంత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం వరికోత యంత్రానికి గంటకు రూ.3,200 తీసుకుంటున్నారు. తుఫాను కారణంగా వరిపైరు నేలవాలడంతో  కోతకు ఎక్కువ సమయం పడుతోందని రైతులు అంటున్నారు. 


రైతులపైనే భారం

ధాన్యం కొనుగోలు సమయంలో సంచుల ధరను రైతులే భరించాల్సిన పరిస్థితి ఉంది. సంచి ధరకు బదులుగా ఒక కిలో ధాన్యం తూకం అధికంగా వేసేవారు. గతంలో  ధాన్యం సంచుల ధర రూ.18 ఉండేది. ప్రస్తుతం వీటి ధర రూ.23కు చేరుకుంది. దీంతో వ్యాపారులు తమపైన భారం పడకుండా    పెరిగిన సంచుల ధరను రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. ధాన్యంబస్తా ధర  రూ.1200 పలుకుతుండగా,  కాటా ఖర్చులు, రోడ్డు మార్గం వరకు ధాన్యాన్ని చేర్చడానికి బస్తాకు రూ.25 ఖర్చవుతోందని, సంచుల ధర అదనపు భారంగా మారిందని రైతులు అంటున్నారు. 


ఎరువు కట్ట 1300, ధాన్యం 1200

కాంప్లెక్స్‌ ఎరువు 50 కిలోలకట్ట ధర రూ.1300 కాగా, బస్తా ధాన్యం ధర రూ.1200 మాత్రమే పలుకుతోందని, బందరు మండలం కోనగ్రామానికి చెందిన రైతులు అంటున్నారు. మద్దతు ధరకు ఽధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


మద్దతు ధర లభించేనా?  

నివర్‌ తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కల్లాల వద్దనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పాలకులు, అధికారులు చెబుతున్నారు.  ఎంత ధరకు  కొనుగోలు చేస్తారనేది చెప్పడంలేదు. ఆర్‌బీకేలు, సచివాలయాల వద్దకు  రైతులు వెళ్లి తమ పంటల వివరాలను ఒక రోజు ముందుగానే నమోదు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి జిల్లాలో సక్రమంగా అమలు కావడంలేదు. వ్యాపారులు, మిల్లర్ల వద్ద సాగు ఖర్చుల నిమిత్తం అప్పు  చేసిన రైతులు వారికే ధాన్యం విక్రయిస్తారు. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నిర్ణయించిందే ధరగా చలామణి అవుతోంది.

Updated Date - 2020-12-17T07:05:36+05:30 IST