విమానాశ్రయ భూముల్లో సాగు చేపట్టిన రైతులు

ABN , First Publish Date - 2020-08-18T09:46:26+05:30 IST

అమరావతి భవిష్యత్తు ప్రతిష్టంభనలో పడటంతో విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చి

విమానాశ్రయ భూముల్లో సాగు చేపట్టిన రైతులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : అమరావతి భవిష్యత్తు ప్రతిష్టంభనలో పడటంతో విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి సిద్ధమయ్యారు. సాగు పనులు కూడా చేపడుతున్నారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సైతం ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. రైతులతో చర్చలు జరుపుతున్నా ఫలితం లేదు. 


నాటి హామీలన్నీ గాలికి..

రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాగా ఉంది. దీంతో ఇక్కడ రియల్‌ భూమ్‌ ఏర్పడింది. భూముల ధరలు భారీగా ఉండేవి. రిజిస్ర్టేషన్‌ రేట్లు కూడా మార్కెట్‌ విలువకు దగ్గరగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటం, టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటం జరిగింది. దీంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీ పీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది.


ఎయిర్‌పోర్టు అథారిటీకి 700 ఎకరాల భూములను అప్పగించింది. రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో చర్చలకు సిద్ధమయ్యారు. అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు యాన్యుటీతో పాటు కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ స్థలాలు, యాన్యుటీ వంటివి కల్పించే ప్రక్రియకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కేటాయించారు. 


ఎన్నికల తరువాత మారిన చిత్రం

ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పక్కన పెట్టేసింది. మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అంశం అపరిష్కృతంగా మారింది. దాదాపు రూ.108 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అంగుళం పురోగతి కూడా లేదు.


ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి విలువ లేకుండా పోతుందని గన్నవరం ప్రాంత రైతులు వాపోతున్నారు. ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


భూముల్లో నాట్లు వేస్తున్న రైతులు

రన్‌వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో రైతులు సాగు ప్రారంభించారు. దుక్కి దున్ని, దమ్ము చేసి  వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్‌వే వెంబడి నేవిగేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ దగ్గర ఉన్న భూముల్లో సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం లభించకపోవటం వల్ల విమానాశ్రయ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. 


న్యాయపోరాటం దిశగా రైతులు

తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు న్యాయపోరాటానికి సిద్ధమవ్వాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించటానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపిక వహించామని, ఇక తమ వల్ల కాదంటున్నారు. తమ సమస్యలన్నిం టికీ పరిష్కారం చూపించాలని కోర్టును ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-08-18T09:46:26+05:30 IST