ఫారెస్ట్‌ ‘రివెంజర్స్‌’.. మామూళ్లు ఇవ్వలేదని నిరుపేదపై కక్ష సాధింపు

ABN , First Publish Date - 2020-12-28T06:58:58+05:30 IST

వన సంరక్షణ సమితుల ద్వారా మొక్కలు నాటి, అడవులను అభివృద్ధి చేయాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే, క్షేత్రస్థాయిలో అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఫారెస్ట్‌ ‘రివెంజర్స్‌’.. మామూళ్లు ఇవ్వలేదని నిరుపేదపై కక్ష సాధింపు
అటవీశాఖ అధికారులు నరికివేసిన తోట

అప్పటికీ నజరానాగా రూ.2 లక్షలు, రెండు గొర్రెలు

అయినా ఆరుగాలం కష్టపడి పెంచిన మొక్కలు నరికివేత

క్షేత్రస్థాయిలో అధికారుల తీరును పట్టించుకోని ఉన్నతాధికారులు


వన సంరక్షణ సమితుల ద్వారా మొక్కలు నాటి, అడవులను అభివృద్ధి చేయాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే, క్షేత్రస్థాయిలో అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వేలాది ఎకరాల అటవీ భూములు పెద్దల ఆక్రమణలో ఉన్నా, చూసీ చూడనట్టు వ్యవహరించే అటవీశాఖ అధికారులు, ఒక నిరుపేద అటవీ భూమిని సాగు చేసుకోవటాన్ని సహించలేకపోయారు. అడిగినపుడల్లా డబ్బులు, గొర్రెపోతులు ఇవ్వలేదన్న అక్కసుతో పదే పదే ఆ పేదవాని ఆర్థిక మూలాలపై దాడి చేస్తున్నారు. విజయవాడ రూరల్‌ మండలం నున్న అటవీ ప్రాంతాన్ని సుమారు మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న షేక్‌ ఈసూబ్‌పై అటవీశాఖ అధికారులు కక్ష సాధింపు చర్యలే ఇందుకు నిదర్శనం.


విజయవాడ రూరల్‌, డిసెంబరు 27 : ‘మాకు మామూళ్లిస్తే.. అటవీ భూములను ఎక్కడైనా.. ఎన్ని ఎకరాలైనా ఆక్రమించుకుని సాగు చేసుకోవచ్చు. ఇవ్వకపోతే వేసిన మొక్కలను నరికేస్తాం. ఎంత పెద్ద చెట్లయినా ఉపేక్షించే ప్రసక్తేలేదు. అవసరమైతే కేసులు పెడతాం.’ అంటూ అటవీశాఖ అధికారులు అటవీ భూములను సాగుచేసుకుంటున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 

నున్న వికాస్‌ కాలేజీ రోడ్డులో నెల్లిగట్టు ప్రాంతంలో వందలాది ఎకరాలను నిరుపేదలు మూడు నాలుగు దశాబ్ధాల క్రితమే ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. వారిలో ఈసూబ్‌ కూడా ఒకరు. తన ఆధీనంలో ఉన్న ఎకరంన్నర అటవీ భూమిలో మామిడి, నిమ్మ తదితర మొక్కలను వేసుకున్నాడు. అక్కడే కొన్ని జీవాలను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అడవిని ఆక్రమించుకున్నందుకు అడిగినపుడల్లా తమకు మామూళ్లు ఇవ్వాలంటూ అటవీశాఖ అధికారులు డిమాండు చేస్తున్నారు. ప్రతిసారీ డబ్బులు ఇవ్వలేనని చెప్పినందుకు 2016లో ఒకసారి, ఇటీవల మరోసారి అధికారులు మామిడి మొక్కలను నరికివేశారు. చివరకు జీవాల కోసం వేసిన షెడ్‌ను కూడా కూల్చేశారు. గతంలో ఒకసారి గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ దృష్టికి తన సమస్యను తీసుకువెళ్లగా, మొక్కలు వేసుకునేందుకు రూ.7,500 ఆర్థిక సహాయం చేసి, అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఆ భూమి అవసరం ఉంటే, అందరితోపాటు ఈసూబ్‌ కూడా ఖాళీ చేస్తాడని ఎమ్మెల్యే అప్పట్లో అధికారులకు చెప్పారు. నాలుగేళ్లపాటు అతనివైపు చూడని అటవీశాఖ అధికారులు ఇటీవల మళ్లీ డబ్బులు ఇవ్వాలని, పండుగకు జీవాలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వారి తాకిడికి తాళలేక దఫాలవారీగా సుమారు రూ.2 లక్షల నగదు, రెండు జీవాలను ఇచ్చాడు. అయినప్పటికీ, సాగు చేసుకుంటున్న భూమిలోని రెండు మూడేళ్ల వయస్సున్న మొక్కలను నరికివేశారని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. విజయవాడ డివిజన్‌ రేంజ్‌ అధికారులు పెట్టే బాధలు తాళలేక అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించినా ఫలితంలేదని వాపోతున్నాడు. అటవీ భూములను సాగు చేసుకుంటున్న పేదల నుంచి, గార్డు మొదలు రేంజర్‌ వరకు మామూళ్లు వసూలు చేస్తున్నా బాధితులు పైకి చెప్పులేకపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే, ఉన్న జీవనోపాధి కూడా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.


ఆత్మహత్యే శరణ్యం

డబ్బులు ఇవ్వాలని, గొర్రెలు, మేకపోతులు ఇవ్వాలని అటవీశాఖ అధికారులు పదేపదే డిమాండ్‌ చేయడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారుతోంది. డబ్బులు ఇవ్వనందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదు. న్యాయం కోసం ఏసీబీ అధికారులను, కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆశ్రయించినా, ఫలితం లేకపోయింది. అటవీశాఖ అధికారుల ఆగడాలను ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి బారి నుంచి నన్ను కాపాడాలని కోరుతున్నా. - ఈసూబ్‌Updated Date - 2020-12-28T06:58:58+05:30 IST