-
-
Home » Andhra Pradesh » Krishna » enquiry on waste dumping
-
బ్యాంకుల ఎదుట ఎందుకీ చెత్త?
ABN , First Publish Date - 2020-12-27T06:27:06+05:30 IST
బ్యాంకుల ఎదుట చెత్త డంపింగ్ వ్యవహారం సీరియస్‌గా మారుతోంది. బ్యాంకర్లు దీనిపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలన్న ఆలోచనతో ఉన్నారు.

రంగంలోకి దిగిన విచారణ బృందం
కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలతో విచారణ
ఉయ్యూరు నగర పంచాయతీలో గంట విచారణ
రేపు బ్యాంకులకు వెళ్లనున్న బృందం
బ్యాంకుల ముందు చెత్త ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు? అధికారుల ఆదేశాలు లేకుండా పారిశుధ్య కార్మికులు ఇలా చేసే అవకాశాలు ఉన్నాయా? విచారణ అధికారులు మున్సిపల్ అధికారులను అడిగిన ప్రశ్నలివి. గురువారం పలు బ్యాంకుల ఎదుట మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది చెత్తను డంప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బృందం శనివారం ఉయ్యూరు నగర పంచాయతీలో విచారణ జరిపింది.
విజయవాడ, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకుల ఎదుట చెత్త డంపింగ్ వ్యవహారం సీరియస్‌గా మారుతోంది. బ్యాంకర్లు దీనిపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలన్న ఆలోచనతో ఉన్నారు. జిల్లాలో పలు బ్యాంకుల ఎదుట పారిశుధ్య సిబ్బంది గరువారం చెత్తను డంప్ చేయడంతో, దానిని ఫొటోలు తీసి, బ్యాంకర్లు కేంద్ర ఆర్థిక శాఖకు, అఖిల భారత సంఘాలకు ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు దీనిపై విచారణ జరపాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచే ఆదేశాలు రావడంతో అధికారులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు ఆర్డీ జి.శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లను విచారణకు నియమించారు. ఈ బృందం శనివారం ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య విభాగానికి చెందిన అధికారులను, పలువురు కార్మికులను విచారించారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం విజయవాడ నగర పాలక సంస్థ కార్యా లయంలోనూ, బ్యాంకుల్లోనూ విచారణ జరపాలని అధికారులు భావించారు.