ఎక్కడివక్కడే!

ABN , First Publish Date - 2020-03-16T10:51:30+05:30 IST

ఎక్కడివక్కడే!

ఎక్కడివక్కడే!

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల కమిషన్‌ ఆరు వారాల పాటు ఎన్నికలు నిలిపివేస్తామని ప్రకటించడంతో అన్ని పార్టీలు ఖంగుతిన్నాయి. ఈనెల ప్రారంభం నుంచి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్ధుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన శనివారం రాత్రి వరకు కొనసాగాయి. ఆదివారం ఉదయం ఎన్నికలు నిలిపివేస్తున్నట్టు ప్రకటన వెలువడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నిరాశ చెందారు. ఈ నెలాఖరు నాటికి ఎన్నికల ఫలితాలు విడుదలై తాము గెలుస్తామని ఆశించిన వారు డీలా పడ్డారు. ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో ఎన్నికల వ్యయం తక్కువగా అవుతుందని సంబరపడిన అభ్యర్థులు ఎన్నికలు వాయిదా పడడంతో తమ వెంట ఉన్న కార్యకర్తలు చెదిరిపోకుండా ఎన్నాళ్లు కాపాడుకోవాలనే డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ డివిజన్లు, వార్డుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను మండలాల వారీగా శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల పేర్లతో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించేందుకు ఆర్డర్లు ఇచ్చారు. శనివారం రాత్రే రిటర్నింగ్‌ అధికారులు బ్యాలెట్‌ పత్రాల ముద్రణ కోసం ప్రింటింగ్‌ ప్రెస్‌లకు తరలివెళ్లారు. ఆదివారం ఉదయానికి ఎన్నికలు నిలిచిపోవడంతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రిస్తారా? లేదా నిలిపివేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఆదివారం ఎన్నికల అధికారులకు ప్రతి మండలంలోనూ శిక్షణ తరగతులు నిర్వహించాల్ని ఉంది. ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఎన్నికలు వాయిదా పడినా కోడ్‌ అమలులో ఉంటుందని జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు ప్రకటించారు. 

Updated Date - 2020-03-16T10:51:30+05:30 IST