అయినా తగ్గరే!

ABN , First Publish Date - 2020-03-16T10:49:51+05:30 IST

అయినా తగ్గరే!

అయినా తగ్గరే!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. సాక్షాత్తు మంత్రులు.. ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు అధికారులు అధికార పార్టీ నేతలకు దాసోహమంటున్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉండే రిటర్నింగ్‌ అధికారి మొదలు ఆర్డీవోలు.. సబ్‌ కలెక్టర్లు అందరిదీ అదే బాట. బెదిరింపులు.. ప్రలోభాలు.. తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నా.. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు మొక్కవోని సంకల్పంతో పోటీకి సై అంటున్నారు. అధికార పార్టీ ఆగడాలకు నిదర్శనాలు ఎన్నో..  విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 40వ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా చెవుల ఆంజనేయులు నామినేషన్‌ వేశారు. ఆయనకు పార్టీ బీ-ఫారం కూడా అందజేసింది. అంతా అయిన తర్వాత మంత్రి వెలంపల్లి  శ్రీనివాస్‌ రంగంలోకి దిగారు. ఆంజనేయులు వద్దకు తన అనుచరులను పంపి బెదిరింపులకు దిగారు. మాట వినకపోతే కేసులు పెట్టి వేధిస్తామని మంత్రి అనుచరులు బెదిరించారు. భయపడిన ఆంజనేయులు పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు టీడీపీ నాయకులకు స్పష్టం చేశారు. వారు ఎంత నచ్చచెప్పినా  ససేమిరా అన్నారు. దీంతో అక్కడ డమ్మీ అభ్యర్థిగా పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన వెలగలేటి భార్గవ రాయుడికి పార్టీ బీ-ఫారం ఇచ్చి రంగంలోకి దింపింది.


ముదినేపల్లి మండలం వైవాక ఎంపీటీసీ అభ్యర్థి జాజుల సుబ్రమణ్యం ఎన్ని బెదిరింపులు వచ్చినా వెరువక నామినేషన్‌ వేసి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే వైసీపీ నాయకులు మరీ బరితెగించి పోటీ నుంచి విరమించుకోకుంటే  అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. దిక్కుతోచని స్థితిలో అతడు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన్ను మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పరామర్శించి ధైర్యం చెప్పారు.  మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ బరిలో నిలిచారు. వైసీపీ నేతలు  తీవ్రస్థాయిలో బెదిరించడంతో వారిలో ఎనిమిది మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ఈడ్పుగల్లు మండలంలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఎంపీటీసీని స్థానిక ఎమ్మెల్యే సారథి అనుచరులు బెదిరించి డబ్బులతో ప్రలోభపెట్టి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. 


నూజివీడులో పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం 32వ వార్డుకు టీడీపీ అభ్యర్థిగా పల్లి నాగరాజును ఎంపిక చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్థానిక ఎస్‌ శ్రీనివాసరావు.. నాగరాజు నిర్వహిస్తున్న సెకండ్‌ హ్యాండు బైకుల షాపు వద్దకు వచ్చి పరోక్షంగా బెదిరింపులకు దిగారు. అవి తీవ్రమవ్వడంతో నాగరాజు పోటీ నుంచి తప్పుకున్నారు. మండలంలోని పల్లెర్లమూడిలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనమదల సత్యనారాయణతోపాటు పలువురు టీడీపీ నాయకుల ఇళ్లలో శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. మద్యం దాచి ఉంచారన్న ఆరోపణలపై ఈ దాడులు చేశామంటూ రెండుగంటలపాటు బీభత్సం సృష్టించారు. 


ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి -2 ఎంపీటీసీగా వైసీపీ తరఫున బరిలో ఉన్న పాలడుగు జ్యోత్స్నకు ముగ్గురు సంతానం ఉన్నారని టీడీపీ నాయకులు ఆధారాలతోసహా ఇచ్చినా ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఎం.దయాకరరావు ఓకే చేశారు. అదే సమయంలో కేతనకొండ-1, 2 ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన టీడీపీ అభ్యర్థులు పులి వెంకటేశ్వర్లు, కొమ్మూరు గోపాలరావు నామినేషన్లను చిన్నచిన్న కారణాలతో తిరస్కరించారు. 


మైలవరం మండలం పుల్లూరు-2 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన వజ్రాల కుమారరెడ్డికి కూడా ఎన్నికల అధికారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. హైకోర్టు కొట్టేసిన కేసును సాకుగా  చూపి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. తనపై కేసును కొట్టివేసిన అంశాన్ని ఆధారాలతోసహా పేర్కొంటూ అప్పీలేట్‌ అధికారి అయిన సబ్‌ కలెక్టర్‌ ధ్యాన్‌చంద్‌కు అప్పీల్‌ చేసుకున్నా రాజకీయ ఒత్తిళ్లతో అక్కడ కూడా ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒత్తిడితోనే కుమార రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురైందని టీడీపీ నేతలు ఆరోపించారు. 


కైకలూరు మండలం చటాకాయ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సైదు లక్ష్మికి ముగ్గురు పిల్లలు. ఈమేరకు అమ్మఒడి పథకం కోసం ముగ్గురు పిల్లలకు ఒకే బ్యాంకు ఖాతా ఇచ్చారు. అన్నీ ఆధారాలతో ఈ విషయాన్ని టీడీపీ అభ్యర్థి గుడివాడ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినా రాజకీయ ఒత్తిళ్లతో ఆయన పట్టించుకోలేదు. 


పలువురు టీడీపీ అభ్యర్థులు, నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే న్యాయస్థానాలు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 39 డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన కె.శివను వైసీపీ నాయకులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. శివతోపాటు వచ్చిన టీడీపీ సీనియర్‌ నాయకుడు గన్నే ప్రసాద్‌ (అన్న)పై మంత్రి అనుచరులు దాడులు చేశారు. ఈ ఘటనలకు పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. అంతా చేసి ఎదురు టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేశారు. మంత్రి వెలంపల్లి ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయారు. హడావిడిగా కేసు నమోదు చేసి జడ్జి ముందు టీడీపీ నేతలను హాజరుపరిచారు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవంటూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ జడ్జి టీడీపీ నేతలకు రిమాండ్‌ విధించేందుకు తిరస్కరించారు. మచిలీపట్నంలోనూ ఇదే సీను జరిగింది. అక్కడ వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న వలంటీర్లను నిలువరించేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడి చేసి, ఎదురు టీడీపీ వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేసుకునేందుకు వచ్చిన వలంటీరుపై ఒత్తిడి తెచ్చి ఈ కేసు నమోదు చేయించారు. ఇక్కడ కూడా సరైన ఆధారాలు లేవంటూ జడ్జి.. టీడీపీ నేతలకు రిమాండ్‌ విధించేందుకు తిరస్కరించారు. 


పామర్రులో పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కైలే అనీల్‌, ఆయన తమ్ముడు పోలీసుల సహకారంతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు. వీరి బెదిరింపులు తట్టుకోలేక పామర్రు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున శీలం శివపార్వతి పోటీ నుంచి విరమించుకున్నారు. 

Updated Date - 2020-03-16T10:49:51+05:30 IST