-
-
Home » Andhra Pradesh » Krishna » Election Staff wanted
-
ఎలక్షన్ స్టాఫ్ కావలెను..!
ABN , First Publish Date - 2020-03-13T10:05:19+05:30 IST
ఎన్నికల సంగ్రామానికి పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారింది. కేవలం పక్షం వ్యవధిలో జరిగే ఎన్నికలకు 50వేలకుపైగా పోలింగ్ సిబ్బంది అవసరం.

ఎన్నికల కావాల్సిన ఎన్నికల సిబ్బంది 56,612
అందుబాటులో ఉన్నవారు 33,981
అదనంగా తీసుకున్న సిబ్బంది 8,138
ఇంకా సమకూర్చుకోలేని పరిస్థితి
అదనపు డ్యూటీలు వేయాలని నిర్ణయం
ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఎన్నికల సంగ్రామానికి పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారింది. కేవలం పక్షం వ్యవధిలో జరిగే ఎన్నికలకు 50వేలకుపైగా పోలింగ్ సిబ్బంది అవసరం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి చూస్తే 30వేల మంది సిబ్బంది కూడా దాటడం లేదు. దీంతో ఒక ఎన్నికలకు పనిచేసిన సిబ్బందినే మరో ఎన్నికకు కూడా ఉపయోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్ భావిస్తున్నారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఒకటికి మించి ఎన్నికల విధులు చేపట్టాల్సి వస్తోంది. వాస్తవానికి ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలంటే వేర్వేరు ఎన్నికలకు వేర్వేరుగా పోలింగ్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉండటంతో అందుబాటులో ఉన్న వారినే తిరిగి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కావాల్సిన పోలింగ్ సిబ్బంది 56,612 మంది
జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 2,752 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉంది. స్టేజ్-1, స్టేజ్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఈవోలు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 19,912 మంది ఎన్నికల సిబ్బంది అవసరం. పంచాయతీ ఎన్నికలకు సంబంఽధించి 9,982 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి 28,572 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 8,128 మంది పోలింగ్ సిబ్బంది కావాలి. ఈ లెక్కన మొత్తంగా 56,612 మంది పోలింగ్ సిబ్బంది అవసరం. జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉన్న అధికారులు, ఉద్యోగుల పరంగా చూస్తే 33,981 మంది వరకు ఉన్నారు.
అదనంగా తీసుకున్నా అంతేనా..!
జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామ సచివాలయాల్లో పనిచేసే 6,247 మందిని, నగరంలోని వార్డు సచివాలయాల్లో పనిచేసే 1,891 మందిని మొత్తంగా 8,138 మందిని యుద్ధప్రాతిపదికన సమకూర్చుకున్నారు. అదనంగా తీసుకున్నా పూర్తిస్థాయిలో సమకూరకపోవంతో తర్జనభర్జనలు పడిన జిల్లా యంత్రాంగం ఉన్న సిబ్బందికే ఒక్కొక్కరికి రెండేసి ఎన్నికల విధులు వేయాలని నిర్ణయించింది. దీంతో సిబ్బంది రెండు రకాల ఎన్నికలకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు.