హీట్‌ పాలిట్రిక్స్‌

ABN , First Publish Date - 2020-03-13T10:06:54+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ హవాను కాపాడుకునేందుకు పెద్దలు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.

హీట్‌ పాలిట్రిక్స్‌

‘స్థానిక’ంగా నెగ్గేందుకు రెండు ప్రధాన పార్ట్టీల కసరత్తు

పెద్దమొత్తంలో నగదు, మద్యం పంపిణీకి రంగంసిద్దం

అలకలు, బుజ్జగింపులు, ఎత్తుకు పైఎత్తులు

జెడ్పీపీఠం, ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలు


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : స్థానిక  సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ హవాను కాపాడుకునేందుకు పెద్దలు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఆయా సామాజికవర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు గడువు తక్కువగా ఉండటంతో ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుంటూ, తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాలు నడుపుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో నామినేషన్ల గడువు పూర్తి కావడంతో రెండు ప్రధాన పార్టీలనుంచి ‘బి’ ఫారం తెచ్చుకునేందుకు బల ప్రదర్శనకు దిగుతున్నారు. 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకున్నవారు తమ పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.   నగదు, మద్యం పంపిణీ చేసినట్లు రుజువైతే ఎన్నికల అనంతరం అయినా అనర్హత వేటు  వేస్తారని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా రాజకీయపక్షాలు రకారకాల ఎత్తుగడలను అనుసరిస్తున్నాయి. 


అధికార పార్టీ నాయకుల దూకుడు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలైతే రాజ్‌భనవ్‌కు వెళ్లి రాజీనామా పత్రాన్ని ఇవ్వమని ఇప్పటికే మంత్రులకు చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తెచ్చుకునేందుకు సిద్ధంగా లేమని  అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గురువారం జడ్పీ కార్యాలయం వద్ద చెప్పుకోవడం గమనార్హం. మంత్రులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో అన్ని విధాలా ప్రయత్నాలు చేసి  గెలుపొందాల్సిందేనని అధికాపార్టీ నాయకులు చెప్పుకోవడం గమనించదగ్గ అంశం.  రానున్న రోజుల్లో అధికారపార్టీ మరింత దూకుడును ప్రదర్శించేందుకు వ్యూహ రచన చేయడం తథ్యమని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. 


జడ్పీని కైవసం చేసుకునేందుకు.. 

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీలు తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఉప్పాల హరికతో గుడ్లవల్లేరు జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్నినాని, కొడాలి నాని హాజరయ్యారు. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలుండగా, వాటిలో 46 స్థానాలకే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను  గెలుపొంది జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న అధికార పార్టీ ఆయా మండలాల్లోని అభ్యర్థులకు నిధులు సమకూర్చే పనిలో ఉందని విశ్వసనీయ సమాచారం. ఈనెల 14న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన అనంతరం, రాజకీయాలను మరింత వేగంవంతం చేసే దిశగా అధికార పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారిక  పేరును అధికారపార్టీ తెరపైకి తీసుకురావడం గమనార్హం. 


 గుంభనంగా టీడీపీ  

 జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు గుంభనంగా రాజకీయాలు నడుపుతున్నారు. అధికారపార్టీ అభ్యర్థులకు ‘బి’ ఫారాలు అందజేసిన  తరువాత  అలకబూనిన అధికారపార్టీ నాయకులను మండలంలో తమ వైపునకు తిప్పుకుని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ అభ్యర్థులను గెలుపు బాటపట్టించాలనే వ్యూహంతో టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికపై ఎన్నికల ఫలితాలు వచ్చాక పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో టీడీపీ నాయకులున్నట్టు సమాచారం. సీపీఎం, సీపీఐ, జనసేనపార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు ధాఖలు చేశారు.  జనసేన పోటీచేసే మండలాల్లో ఓట్ల చీలిక ప్రభావం ఏ పార్టీపై పడుతుందనే అంశంపైనా రాజకీయ నాయకులు అంచనాలు వేస్తున్నారు.


అన్ని ఎన్నికలు ఒకేసారి రావడంతో..

 మున్సిపోల్స్‌తో సహా స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఎన్నికల ఖర్చులు ఎలా భరించాలనే అంశంపై ఆయా రాజకీయపార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీటీసీ ఎన్నికలపై దృష్ట్టిసారిస్తే  ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై  పడుతుందని, ఎంపీటీసీ ఎన్నికలకు ఒకసారి, పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఓటర్లలో కొంతమందికైనా నగదు, మద్యం పంపిణీ చేయాల్సి ఉందనే వాదనను ఆయా పార్టీల నాయకులు వినిపిస్తున్నారు. తక్కువ సమయం ఉండటంతో కొంతమేర ఖర్చులు తగ్గినా ఇరవై రోజుల వ్యవధిలోనే రెండు, మూడు ఎన్నికలు రావడంతో ఖర్చు తడిసిమోపెడవుతుందని అభ్యర్థులు, వారిని బలపరిచే నాయకులు చెప్పుకుంటున్నారు. 


Updated Date - 2020-03-13T10:06:54+05:30 IST