దసరా ఏర్పాట్లు.. అమ్మవారి ఆలయ ప్రాకారాలకు రంగులతో నూతన శోభ
ABN , First Publish Date - 2020-10-03T17:29:12+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు

ఆలయ ప్రాంగణంలో రంగవల్లులు
వేగంగా క్యూలైన్ల నిర్మాణం
(విజయవాడ, ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా ఈ నెల 17 నుంచి 25 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించడంతో దుర్గగుడి అధికారులు పనులు ప్రారంభించారు. ఒకపక్క అమ్మవారి ఆలయ ప్రాకారాలకు రంగులు వేస్తూ శోభాయమానంగా అలంకరిస్తుంటే, మరోపక్క ప్రాంగణంలో మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు.
ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇక 15 రోజుల సమయం కూడా లేకపోవడంతో ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రతిఏటా కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి కొండపైకి కూలైన్ల నిర్మాణ పనులు ప్రారంభించేవారు. ఈసారి కొండపైనుంచి ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లు నిర్మిస్తున్నారు. పబ్లిక్ మైక్ అనౌన్స్‌మెంట్, అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులను మొదలు పెడుతున్నారు. కొండపైన ప్రధాన ఆలయం, ఉపాలయాలు, గోపురాలు, ప్రాకార మండపాలతో పాటు కింద ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు.