ధరల దరువు

ABN , First Publish Date - 2020-03-30T09:59:50+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లాక్‌డౌన్‌ను ‘క్యాష్‌’ చేసుకునేందుకు గొల్లపూడిలోని హోల్‌సేల్‌ ట్రేడర్లు కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులకు బిల్‌ లెస్‌ విక్రయాలకు పాల్పడుతున్నారు.

ధరల దరువు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : లాక్‌డౌన్‌ వేళ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లాక్‌డౌన్‌ను ‘క్యాష్‌’ చేసుకునేందుకు గొల్లపూడిలోని హోల్‌సేల్‌ ట్రేడర్లు కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులకు బిల్‌ లెస్‌ విక్రయాలకు పాల్పడుతున్నారు. అధిక ధరలకు అమ్ముకోవటానికి ఈ మార్గాన్ని ఎంచుకోవటంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఫలితంగా రిటైల్‌ మార్కెట్‌లోనూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 


సలసలమంటున్న నూనెలు.. 

మార్కెట్‌లో నూనెల ధరలు సలసలమంటున్నాయి. నిన్నటి వరకు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఒక కేసు ధర రూ.1380-రూ.1,394గా ఉండేది. ఇది హోల్‌సేల్‌ వ్యాపారికి ఇచ్చే ధర. ఆ తరువాత హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.1,480-రూ.1,500కు విక్రయించేవారు. ప్రస్తుతం ట్రేడర్ల దగ్గరే సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఒక కేసు ధర రూ.1,650, 1,680, 1,700 చొప్పున ఉంటోంది. ఈ లెక్కన హోల్‌సేల్‌ వ్యాపారి తన లాభం చూసుకుని ఎక్కువ రేటుకు అమ్మాలి. కొందరు ట్రేడర్లు బిల్‌లెస్‌గా ఆయిల్‌ కేసులను విక్రయిస్తున్నారు. మరికొందరు బిల్‌తో కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 


రవ్వలు ‘నో స్టాక్‌’

రవ్వ పదార్థాలకు సంబంధించి ట్రేడర్ల వద్ద ‘నో స్టాక్‌’ అంటున్నారు. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ స్టాకు లేదని హోల్‌సేల్‌ వ్యాపారులకు చెబుతున్నారు. ‘ఎందుకు స్టాకు లేదు. కృత్రిమ కొరత ఏమైనా సృష్టిస్తున్నారా?’ అనే ప్రశ్నలకు... వాటికి పెద్దగా డిమాండ్‌ ఉండదని, తక్కువ మొత్తంలోనే స్టాకును తెస్తామని ట్రేడర్లు సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం వీటి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల స్టాకు అయిపోయిందని చెబుతున్నారు. అయితే, ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


'పరిస్థితి ఇదీ..

వారం కిందటి వరకు ట్రేడర్ల దగ్గర బెల్లం కిలో రూ.47-48గా ఉండేది. హోల్‌సేల్‌ వ్యాపారులు రూ.50-రూ.52కు విక్రయించేవారు. ప్రస్తుతం కెనాల్‌ రోడ్డులోని బెల్లం ట్రేడర్ల దగ్గర రూ.60 పలుకుతోంది. తాడేపల్లిగూడెం నుంచి కెనాల్‌ రోడ్డు ట్రేడర్లకు బెల్లం వస్తోంది. కెనాల్‌ రోడ్డులోని కొందరు ట్రేడర్లు మాత్రం బిల్లులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 


పప్పు దినుసుల ధరలు పైపైకి చేరాయి. మినపప్పు బస్తా ధర రూ.7,600 నుంచి రూ.9,000కు పెరిగింది. బస్తా అంటే 100 కిలోలు. బిల్లులు లేకుండానే చాలామంది ట్రేడర్లు మినప్పప్పును విక్రయిస్తున్నారు. కందిపప్పు కేజీ రూ.90 ఉండేది. ప్రస్తుతం రూ.95-రూ.100. ఇతర పప్పు దినుసులన్నీ కూడా రూ.5-రూ.10 మధ్యన పెరిగాయి.


ఆశీర్వాద్‌ కంపెనీ అందించే గోధుమపిండి ఎమ్మార్పీ ధర రూ.58. హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.46 నుంచి రూ.47కు ఇచ్చేవారు. రిటైల్‌కు వచ్చేసరికి ఎమ్మార్పీ ధరకే అమ్మేవారు. ప్రస్తుతం హల్‌సేల్‌ వ్యాపారులకే రూ.55 నుంచి రూ.58కు విక్రయిస్తున్నారు. దీంతో రిటైలర్లకు ఎమ్మార్పీపై అధికంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-03-30T09:59:50+05:30 IST