అమ్మ ఆదాయానికి గండి?

ABN , First Publish Date - 2020-12-07T06:30:56+05:30 IST

ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో ఏ ఉద్యోగైనా ఏం చేస్తారు?

అమ్మ ఆదాయానికి గండి?

దుర్గగుడి నికరాదాయంలో గోల్‌మాల్‌

రూ.49.70 లక్షలకు బదులు రూ.85.18 లక్షలు

రూ.7.60 కోట్ల మేర అమ్మ ఆదాయానికి గండి 

రూ.70 కోట్ల పనుల కోసం ఈవో అడ్డదారులు

ఈవో నిర్వాకంపై కమిషనర్‌కు ఉద్యోగి ఫిర్యాదు

మంత్రి ఒత్తిడితో పట్టించుకోని కమిషనరేట్‌ 


ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో ఏ ఉద్యోగైనా  ఏం చేస్తారు? తనకు చట్టబద్ధంగా లభించే అన్ని మినహాయింపులనూ వినియోగించుకుని ఆ తర్వాత ఎంత చెల్లించాలో అంతే చెల్లిస్తాడు. అలాకాకుండా ‘మినహాయింపులు ఏమీ వద్దు... నా మొత్తం ఆదాయంపై పన్ను చెల్లిస్తా’ అని ఎవరైనా చెబుతారా..? ఎవరూ చెప్పరు.. ఒక్క దుర్గగుడి అధికారులు తప్ప. అలా ఎందుకు చెప్పారు? అలా చెప్పడంవల్ల అమ్మవారి ఆదాయానికి ఎన్ని కోట్లు గండి పడింది? ఇలా చేయడం ద్వారా దుర్గగుడి అధికారులకు కలిగే లబ్ధి ఏమిటి? 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి ప్రతియేటా భక్తులు వివిధ రూపాల్లో కానుకలు అందజేస్తుంటారు. ధన రూపంలో వచ్చిన కానుకల నుంచి దేవస్థానం ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని సెక్యూరిటీ లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో దేవస్థానం అధికారులు బ్యాంకుల్లో భద్రపరుస్తారు. వీటిని ఆలయ అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఏటా రూ.30 నుంచి 35 కోట్ల విలువైన సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో వేస్తుంటారు. ఆదాయపుపన్ను సెక్షన్‌ 65 ప్రకారం వీటిని నికరాదాయంగా చూపించాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా దేవస్థానం అధికారులు ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటూ నికర ఆదాయ నివేదికలను తయారు చేస్తున్నారు. వాటిని దేవదాయశాఖ కమిషనర్‌కు పంపి, ఆమోదముద్ర వేయించుకుంటున్నారు. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన నికర ఆదాయ నివేదికలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సైతం నికరాదాయంగా చూపారు. ఫలితంగా దుర్గమ్మ సొమ్ముకు రూ.7.62 కోట్లు గండికొట్టారు.  2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌డీలను కలపకుండా రూ.49.70 కోట్లు నికరాదాయంగా చూపి, తొలుత నివేదిక తయారు చేశారు. కానీ ఈవో జోక్యంతో ఈ నివేదిక మొత్తం మారిపోయింది. ఎక్స్‌పెండీచర్‌లో చూపించాల్సిన తాజా ఎఫ్‌డీఆర్‌లు రూ.35.48 కోట్లను ఆ  విభాగం నుంచి తీసివేసి, అసెస్‌బుల్‌ ఇన్‌కమ్‌లో కలిపేశారు. దీంతో నికరాదాయం ఒక్కసారిగా రూ.85.18 కోట్లకు పెరిగింది. ఇలా పెరగడం వల్ల అసెస్‌బుల్‌ ఇన్‌కమ్‌ నుంచి దేవస్థానం చెల్లించాల్సిన స్టాట్యుటరీ పేమెంట్స్‌ (చట్టబద్ధమైన చెల్లింపులు) కూడా పెరిగిపోయాయి. తద్వారా అమ్మవారి ఖజానాకు గండి పడింది. 


రూ.70 కోట్ల పనుల కోసమేనా..?

నికరాదాయం పెంచి చూపడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల దసరా సమయంలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో సీఎం జగన్‌ రూ.70 కోట్లను దుర్గగుడి అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దుర్గగుడి అధికారులు సుమారు రూ.85 కోట్ల పనులకు అంచనాలు సిద్ధం చేశారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం ప్రకటించిన రూ.70 కోట్లు విడుదల కావడం అనుమానాస్పదమే. దీంతో ఎలాగైనా ఆ మొత్తాన్ని విడుదల చేయించుకునేందుకు దుర్గగుడి అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అమ్మవారి పేరిట వేసిన ఎఫ్‌డీలను నేరుగా తీయడం నిబంధనల ప్రకారం కుదరదు. దీంతో నికరాదాయం పెంచి చూపడం ద్వారా ఎఫ్‌డీలను పరోక్షంగా కరిగించేయడంతోపాటు ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి, తిరిగి పనుల పేరిట ఆ నిధులనే విడుదల చేయించుకోవాలన్నది దుర్గగుడి అధికారుల ప్లాన్‌. రూ.70 కోట్ల విలువైన పనుల్లో 10 శాతం కమీషన్‌ లెక్కవేసినా రూ.7 కోట్లను అప్పనంగా జేబులో వేసుకునేందుకే దుర్గగుడి అధికారులు అమ్మవారి ఆదాయాన్ని కరగదీసే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపణలున్నాయి. 


మంత్రి భజనకు అమ్మవారి నిధులు

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆశీస్సులతో దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సురేశ్‌బాబు ఆయన రుణం తీర్చుకునే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు. వెలంపల్లి దేవదాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌ 8న శుభాకాంక్షలు తెలుపుతూ అధికారపార్టీకి చెందిన పత్రికలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పేరుతో పెద్ద ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో మంత్రి ఫొటోతోపాటు దుర్గగుడి చైర్మన్‌, ఈవో ఫొటోలు కూడా ప్రచురించారు. ఉద్యోగుల సీసీఏ రూల్‌ నం.19 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడం రాజకీయ పార్టీలకు ప్రయోజనం కలిగేలా వ్యయం చేయడం చట్ట విరుద్ధం. కానీ ఈవో ఏకంగా దుర్గగుడి సొమ్మునే రాజకీయ నాయకుల మెప్పు కోసం వారి ప్రచారానికి ఖర్చు చేయడం గమనార్హం. ఈ ప్రకటన కోసం అమ్మవారి నిధులు రూ.83 వేలను బిల్లు నంబరు 1013506 ద్వారా ఈవో చెల్లించారు.  


నష్టం ఎలాగంటే.. 

దుర్గగుడికి వచ్చే వార్షిక నికరాదాయం నుంచి ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండ్‌ (ఈఏఎఫ్‌) 8 శాతం, కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) 9 శాతం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ (ఏడబ్ల్యూఎఫ్‌) 3 శాతం, ఆడిట్‌ ఫీజు 1.50 శాతం చెల్లిస్తారు. దేవస్థానం నికరాదాయం పెరిగే కొద్దీ ఈ చెల్లింపుల మొత్తం కూడా పెరుగుతుంది. ఈ చెల్లింపులు మొత్తం అసెస్‌బుల్‌ ఇన్‌కమ్‌ పెంచకముందు రూ.10.68 కోట్లు ఉండగా.. పెంచిన తర్వాత అది రూ.18.31కోట్లకు పెరిగింది. దీంతో దేవస్థానంపై రూ.7.62 కోట్ల అదనపు భారం పడింది. గత రెండేళ్ల నివేదికలను కూడా ఇదే విధంగా తయారు చేసేందుకు ఈవో సిద్ధమవుతున్నారు. దీంతో సుమారు రూ.20 కోట్ల దేవస్థానం ఆదాయానికి గండి పడనుంది. ఇదే విధానాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తే దేవస్థానంపై అదనపు భారం పడి అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. 

Updated Date - 2020-12-07T06:30:56+05:30 IST