దుర్గగుడి అధికారుల గిరి ప్రదక్షిణ

ABN , First Publish Date - 2020-12-01T06:29:59+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గగుడి అధికారులు, పాలకమండలి, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

దుర్గగుడి అధికారుల గిరి ప్రదక్షిణ
అమ్మవారి ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్న దుర్గగుడి అధికారులు, వేద పండితులు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది

విజయవాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గగుడి అధికారులు, పాలకమండలి, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు మల్లిఖార్జున మహామండపంలో అమ్మవారి ప్రచార రథం వద్ద ఆలయ ఈవో ఎం.వి.సురేశ్‌బాబు, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధానార్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలినడకన గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. మహామండపం నుంచి కనకదుర్గానగర్‌, కుమ్మరిపాలెం సెంటర్‌, సితార సెంటర్‌, చిట్టినగర్‌, పాల ఫ్యాక్టరీ, బ్రాహ్మణవీధి, రథం సెంటర్‌ మీదుగా తిరిగి మహామండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దారిపొడవునా భక్తులు ప్రచార రథంలో కొలువుదీరిన ఆదిదంపతుల ఉత్సవ మూర్తులకు భక్తిశ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నిర్వహించాలని దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి ఉన్నందున ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వేదపండితులు, అర్చకులతో పరిమిత సంఖ్యతోనే గిరి ప్రదక్షిణ చేశామని, కరోనా ముప్పు తొలగిపోతే వచ్చే ఏడాది నుంచి ఏటా వేలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం ఈవో సురేశ్‌బాబు తెలిపారు. 

Updated Date - 2020-12-01T06:29:59+05:30 IST