పండితులారా..!ఇదేమి చోద్యం?

ABN , First Publish Date - 2020-11-25T06:42:43+05:30 IST

కోట్లాది భక్తుల కొంగుబంగారమైన కనకదుర్గమ్మ సన్నిధిలో పనిచేస్తున్న వేదపండితులను దైవ స్వరూపులుగా భావిస్తారు భక్తులు.

పండితులారా..!ఇదేమి చోద్యం?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాక కోసం ఎన్‌జీవో భవన్‌ వద్ద ఎదురు చూస్తున్న దుర్గగుడి వేదపండితులు

విజయవాడ - ఆంధ్రజ్యోతి : కోట్లాది భక్తుల కొంగుబంగారమైన కనకదుర్గమ్మ సన్నిధిలో పనిచేస్తున్న వేదపండితులను దైవ స్వరూపులుగా భావిస్తారు భక్తులు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వరస్వామి పవిత్ర సన్నిధిలో భక్తి శ్రద్ధలతో వైదిక కార్యక్రమాలు నిర్వహించే వేదపండితులు మంగళవారం నగరంలోని ఎన్‌జీవో భవన్‌లో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబ్‌సైట్‌ ఆవిష్కరణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందించిన దుర్గగుడి వేద పండితుల తీరుతో అమ్మవారి ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు దేవస్థానానికి వచ్చినప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం దేవస్థానం తరపున వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలకడం, వేదాశీర్వచనాలు అందించడం సహజం. కానీ దేవస్థానానికి దూరంగా ఎక్కడో ఓ ప్రైవేట్‌ భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి ఓ ఉద్యోగ సంఘ నేత ఆహ్వానం మేరకు దుర్గగుడి వేదపండితులు హాజరు కావడం, కనీసం ప్రొటోకాల్‌ కూడా లేని ప్రభుత్వ సలహాదారుకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళ వాయిద్యాల నడుమ పూర్వకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందించడాన్ని ఇంద్రకీలాద్రి వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వేదపండితులు.. అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ.. దుర్గగుడి ప్రతిష్టను మంటగలుపుతారా? అంటూ పలువురు మండిపడుతున్నారు. 

Updated Date - 2020-11-25T06:42:43+05:30 IST