ఫెర్రీ వర్రీ

ABN , First Publish Date - 2020-12-10T06:03:43+05:30 IST

ఫెర్రీ వర్రీ

ఫెర్రీ వర్రీ
డ్రెయినేజీలు లేక అపార్ట్‌మెంట్‌ వద్ద తీసిన మురుగు గుంతలు

అధ్వానంగా పారిశుధ్యం

డ్రెయినేజీల నిర్మాణాలో ్లమున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం

అపార్ట్‌మెంట్‌ వాసులకు    ప్రాణసంకటం

కొండపల్లి మున్సిపల్‌ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఫెర్రీ పరిస్థితి వర్రీగా మారింది. పారిశుధ్యం అధ్వానంగా మారి అపార్ట్‌మెంట్‌ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టించుకోవాల్సిన అధికారులు కాలయాపన చేస్తుండటంతో డ్రెయినేజీ వ్యవస్థ అక్కరకు రాక, దుర్గంధం భరించలేక స్థానికులు అల్లాడిపోతున్నారు.

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 9 :  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫెర్రీకి వెళ్లే దారులతో పాటు పలు రహదారులను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దారు. దీంతో పాటు పవిత్రసంగమం రూపుదిద్దుకోవటంతో ఫెర్రీ ప్రధాన రహదారిని అందంగా ముస్తాబు చేశారు. దీంతో ఇక్కడ అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు ఊపందుకున్నాయి. విజయవాడకు దగ్గరగా ఉండటంతో పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులు, రైతులు పిల్లల చదువుల నిమిత్తం అపార్ట్‌మెంట్లు కొని నివాసముంటున్నారు. అయితే, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థలను, రహదారులను నిర్మించటంలో మున్సిపల్‌ అధికార యంత్రాంగం కాలయాపన చేస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఫెర్రీలో డ్రెయినేజీలు నిర్మించటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. వందలాది కుటుంబాలు అపార్ట్‌మెంటుల్లో నివాసముంటున్నా కనీస మౌలిక వసతుల కల్పనలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. ఫెర్రీలోని ఆర్టీసీ కాలనీలో సహాయ మాత పాఠశాల రహదారి మార్గంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు చేసి         నెలలు గడుస్తున్నా డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్‌ ముందు భాగంలో పెద్ద గోతులు తీశారు. దీంతో దోమలు వ్యాప్తి చెందడటంతో పాటు విపరీతమైన దుర్గంధం వస్తోంది.

పట్టించుకోని అధికారులు

ఇదే విషయాన్ని పలుమార్లు అపార్ట్‌మెంట్‌ వాసులు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ‘చూద్దాం.. చేద్దాం..’ అంటున్నారు కానీ, పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. నిధులు మంజూరై నిర్మాణాలు చేపట్టేలోపు అంటువ్యాధులు వ్యాపిస్తే ఎవరూ బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అపార్ట్‌మెంట్‌ వాసులు కోరుతున్నారు. పెద్ద గుంతలు ఉండటం వల్ల చిన్నపిల్లలకు ప్రమాదం జరుగుతుందేమోనని వారు భయపడుతున్నారు.

రూ.16 లక్షలతో అంచనాలు సిద్ధం చేశాం

ఫెర్రీ ఆర్టీసీ కాలనీలో అపార్ట్‌మెంట్ల మధ్య ఇరువైపులా శాశ్వత డ్రెయినేజీల నిర్మాణాల కోసం ఎన్‌ఆర్‌జీఎస్‌ కింద రూ.16 లక్షలతో అంచనాలు సిద్ధం చేశాం. వారంలో శాశ్వత పరిష్కారం కింద నిర్మాణాలు చేపట్టి పూర్తిచేస్తాం. డ్రెయినేజీల నిర్మాణాలతో మురుగు సమస్య తొలగిస్తాం.

-  పర్వతనేని శ్రీధర్‌, కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌



Updated Date - 2020-12-10T06:03:43+05:30 IST