అవగాహనతోనే ‘కేర్‌’ తీసుకున్నారా?

ABN , First Publish Date - 2020-12-01T06:37:57+05:30 IST

విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

అవగాహనతోనే ‘కేర్‌’ తీసుకున్నారా?
న్యాయవాదితో కలసి విచారణకు హాజరై తిరిగి వస్తున్న డాక్టర్‌ రమేష్‌బాబు

డాక్టర్‌ రమేష్‌ను విచారించిన పోలీసులు

న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన రమేష్‌

ఆసుపత్రి నిర్వహణపైనే తొలిరోజు విచారణ

మరో రెండు రోజులపాటు సాగనున్న విచారణ

జరిగిన ఘటనపై నేడు ఆరా?


పోలీస్‌ : ఎన్ని సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ఉన్నారు?

రమేష్‌ : సుమారు 32 సంవత్సరాల నుంచి.

పోలీస్‌ : ఆసుపత్రుల నిర్వహణపై పూర్తి అవగాహన ఉందా?

రమేష్‌ : వైద్యుడ్ని కాబట్టి పూర్తి అవగాహన ఉంది.

పోలీస్‌ : కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణ నిబంధనలన్నీ తెలుసా?

రమేష్‌ : తెలుసు.


విజయవాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి)  

విజయవాడ నగరంలోని స్వర్ణప్యాలెస్‌లో రమేష్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆగస్టు తొమ్మిదో తేదీ తెల్లవారుజామున  అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రమేష్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌ను విచారించిన పోలీసులు అడిగిన ప్రశ్నలివి. హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల విచారణలో భాగంగా సోమవారం సూర్యరావుపేట పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న తన కార్యాలయంలో అదనపు ఉపకమిషనర్‌-2 లక్ష్మీపతి డాక్టర్‌ రమేష్‌ను విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సుదీర్ఘ విచారణ సాగింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ విచారణ సాగించారు. డాక్టర్‌ రమేష్‌ వెంట న్యాయవాది సోము కృష్ణమూర్తిని అనుమతించారు. అదనపు ఉపకమిషనర్‌ చాంబర్‌లో ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. తొలిరోజు విచారణ మొత్తం రమేష్‌ కుటుంబం, ఆసుపత్రిలో వారి భాగస్వామ్యం, ఆసుపత్రి నిర్వహణపైనే సాగిందని విశ్వసనీయంగా తెలిసింది. రమేష్‌ వైద్య విద్య, విజయవాడలో ఆసుపత్రి ప్రారంభం, నిర్వహణ, కార్యకలాపాలపై లక్ష్మీపతి ప్రశ్నించినట్టు తెలిసింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసేటప్పుడు ఆసుపత్రి, హోటల్‌ యాజమాన్యాల మధ్య ఎంవోయూ జరిగిందా? అనే ప్రశ్నకు అగ్రిమెంట్‌ ప్రకారమే స్వర్ణప్యాలెస్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు తీసుకున్నామని రమేష్‌ వివరించినట్టు తెలిసింది. ప్రమాద ఘటనపై మంగళవారం ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఆయనను పోలీసులు విచారిస్తారు. 

Updated Date - 2020-12-01T06:37:57+05:30 IST