డోర్‌ డెలివరీ జనవరిలో లేనట్టే!

ABN , First Publish Date - 2020-12-31T05:13:21+05:30 IST

కొత్త సంవత్సరంలో ఇంటింటికీ నిత్యావసరాలను..

డోర్‌ డెలివరీ జనవరిలో లేనట్టే!

పూర్తిస్థాయిలో సన్నద్ధత లేకపోవటమే సమస్య 

కొనసాగుతున్న రేషన్‌ షాపుల మ్యాపింగ్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కొత్త సంవత్సరంలో ఇంటింటికీ నిత్యావసరాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యేలా లేదని తెలుస్తోంది. ‘ఆంధ్రజ్యోతి’కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరిలో యథాతథంగానే నిత్యావసరాల పంపిణీ జరుగుతుంది. పూర్తిస్థాయిలో అంతా సిద్ధం కానందునే డోర్‌ డెలివరీ వాయిదా పడుతున్నట్టు సమాచారం. ఇక డోర్‌ డెలివరీని ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశాలున్నాయి. రైస్‌ కార్డుల మ్యాపింగ్‌ ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తోంది. ఒక సచివాలయం పరిధిలో వెయ్యి కార్డులు ఉంటే.. దాదాపు 20 క్లస్టర్లు ఉంటాయి. రెండు రేషన్‌ షాపులు ఉంటే.. చెరో పది క్లస్టర్లు కేటాయిస్తారు. ఇదే సమయంలో వెహికల్‌ మ్యాపింగ్‌ జరుగుతోంది.


రోజుకు 90 కార్డుల లెక్కన వెహికల్‌ మ్యాపింగ్‌ జరుగుతోంది. పదిహేను రోజుల నుంచి 22 రోజుల వరకు వాహనాలను ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మరో పది రోజుల సమయం పడుతుంది. వాహనాలను ఇప్పటికే మండలాలకు కేటాయించారు. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఎండీయూ) ఎఫ్‌పీ షాపులకు ట్యాగ్‌ ఆన్‌ చేస్తున్నారు. ఇది కూడా మరికొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎఫ్‌పీ షాపుల దగ్గర సరుకు ఉంటుంది కాబట్టి.. రేషన్‌ డీలర్ల పాత్ర ఏమిటన్నది ఇంకా అస్పష్టంగా ఉంది. విధి విధానాలు ఎప్పుడు ఖరారు చేస్తారన్నది చూడాలి.

Updated Date - 2020-12-31T05:13:21+05:30 IST