-
-
Home » Andhra Pradesh » Krishna » District Lockdown
-
బెజవాడలో హై అలర్ట్.. ఆంక్షలు ప్రకటించిన డివిజన్లు ఇవే..
ABN , First Publish Date - 2020-03-23T09:37:57+05:30 IST
విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన..

జిల్లా లాక్‌డౌన్
వన్‌టౌన్‌లోని 30 డివిజన్లలో రాకపోకలపై ఆంక్షలు
12 చెక్ పోస్టులు ఏర్పాటు
200 పడకలతో మరో ఐసోలేషన్ వార్డు
సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏర్పాటు
నిత్యావసర దుకాణాలు, రైతుబజార్లకు మినహాయింపు
ప్రజారవాణాకు బ్రేక్.. అత్యవసరమైతేనే బయటకు..
జిల్లావాసులకు కలెక్టర్ ఇంతియాజ్ సూచన
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా లాకౌడౌన్ ప్రకటించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. వన్‌టౌన్‌లోని మేకావారి వీధి నుంచి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలోని 30 కార్పొరేషన్ డివిజన్లలో మనుషులు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక్కడ 12 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈనెల 31వ తేదీ వరకు ఆ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వన్‌టౌన్ యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బాధితుడి కుటుంబ సభ్యులను, అతని స్నేహితుడిని సోమవారం ఉదయం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అత్యవసర సేవలకు ఇబ్బంది ఉండబోదన్నారు. బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
200 పడకలతో ఐసోలేషన్ వార్డు
విజయవాడలో 200 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ వెనుక ఉన్న లేడీస్ హాస్టళ్లను ఇందుకు వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు అందుబాటులో ఉంది.
ఆంక్షలు ప్రకటించిన డివిజన్లు ఇవే..
కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోని 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 47, 48, 49, 50, 51 డివిజన్లలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. నోడల్ అధికారులకు వెస్ట్ జోన్ ఏసీపీ కె.సుధాకర్, ఏఎంహెచ్‌వో బాబు శ్రీనివాస్‌ను నియమించారు.
విదేశాల నుంచి 1,044 మంది
జిల్లాకు ఆదివారం నాటికి 1,044 మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీరందరినీ వైద్య సిబ్బంది నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే స్వచ్ఛందంగా వివరాలను వైద్యసిబ్బందికి వెల్లడించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.