-
-
Home » Andhra Pradesh » Krishna » death
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ABN , First Publish Date - 2020-11-25T06:27:35+05:30 IST
విజయవాడ - నిడుమోలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కూచిపూడి, నవంబరు 24 : విజయవాడ - నిడుమోలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గూడూరు మండలం కలపటం గ్రామానికి చెందిన మద్దాల శ్రీను, జొన్నలగడ్డ శ్రీనివాసరావు(45), పినగూడూరు లంకకు చెందిన ఇంతియాజ్ (27) బైక్‌పై కల్పటం నుంచి కంకిపాడు వెళ్తున్నారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న కారు నిడుమోలు మసీదు సమీపంలో మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకులు తీవ్రగాయాలపాలై రోడ్డుపై పడిపోయారు. మద్దాలి శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంతియాజ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. గాయాలపాలైన జొన్నలగడ్డ శ్రీనివాసరావును వైద్య సహాయం నిమిత్తం ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కూచిపూడి ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు గ్రామాల్లో విషాదం
ఇద్దరు యువకుల మృతితో కలపటం, పినగూడూరు లంకలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయ చర్యలను మాజీ జడ్పీటీసీ సభ్యుడు బూరగడ్డ శ్రీకుమార్, పినగూడూరులంక మాజీ సర్పంచి కరీముల్లా పర్యవేక్షించారు.