డేంజర్..యమ డేంజర్..
ABN , First Publish Date - 2020-04-25T09:31:55+05:30 IST
కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు పరిస్థితి ఇది

తెల్లవారుజామున భౌతిక దూరానికి బై బై
కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో కనిపించని నిబంధనలు
గుంపులు గుంపులుగా, మాస్కులు లేకుండా..
రెడ్‌జోన్ ప్రాంతాల్లోని అంతర్గత వీధుల్లోనూ జన సంచారం
కలవరపెడుతున్న పరిస్థితులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ :
కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు పరిస్థితి ఇది. ప్రపంచమంతా కరోనాపై యుద్ధం చేస్తుంటే, ఇక్కడ మాత్రం చూడండి ఎంత యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో.. కరోనాపై జరిగే యుద్ధంలో గెలిచేది ఇలాగేనా..? ఈ ప్రాంతానికి దగ్గరలో రెడ్‌జోన్లు అయిన కార్మికనగర్, పాతరాజరాజేశ్వరిపేట ఉన్నాయి. అయినా ఏమాత్రం బెరుకు లేకుండా.. భౌతిక దూరానికి నీళ్లొదిలేస్తూ రోడ్డు వెంట ఇలా గుంపులుగా కిక్కిరిసి కనిపించారు.
గస్తీలేని సమయంలో..
ఉదయం ఆరు గంటల నుంచి పోలీసులు రహదారులపై ఉంటున్నారు. మాస్క్ ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా ఊరుకోవట్లేదు. ఇదో తలనొప్పిగా ఉందనుకుంటున్న వారంతా తెల్లవారుజామున తిరిగేస్తున్నారు. దీనికి కేదారేశ్వరపేట మ్యాంగో మార్కెట్ వేదికవుతోంది. మామిడి సీజన్ ప్రారంభంకావడంతో నున్న, నూజివీడు చుట్టుపక్కల నుంచి ఇక్కడికి మామిడికాయలు వస్తుంటాయి. తెల్లవారుజాము నుంచే సందడి మొదలవుతోంది.
ఆ సమయంలో గస్తీ పెద్దగా ఉండకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా వచ్చేస్తున్నారు. ఇక్కడే కూరగాయలను విక్రయించడానికి కొంతమంది రైతులు గ్రామాల నుంచి వస్తు న్నారు. వీటిని కొనటానికి పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్, సత్యనారాయణపురం, గాంధీనగర్, హనుమాన్‌పేట, గుణదలకు చెందిన వారంతా తెల్లవారుజామునే వస్తున్నారు. దీంతో వాతావరణమంతా తిరునాళ్లను తలపిస్తోంది.
ముప్పుతెచ్చిన పేకాట.. హౌసీ..
కృష్ణలంకలోని జీవీఆర్ (గుర్రాల వీరరాఘవులు) వీధిలో ఉన్న లారీడ్రైవర్ లోడుతో మహారాష్ట్రకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అదే వీధిలో ఉంటున్న స్నేహితులను, కొంతమంది యువకులను తన ఇంటికి పిలిపించుకున్నాడు. బోర్ కొట్టకుండా ఉండటానికి పేకాట డెన్‌ను నిర్వహించాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా షిఫ్ట్‌లవారీగా పేకాటను నడిపేశాడు.
భర్తకు తగ్గట్టుగానే భార్య కూడా వ్యవహరించింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉన్న మహిళలను ఇంటికి రప్పించుకుని కాలక్షేపానికి హౌసీ ఆడించింది. దీంతో కృష్ణలంక డీవీఆర్ వీధిలో పాజిటివ్ కేసుల సంఖ్యను పెంచేసింది. ఏకంగా ఈ ఒక్క వీధిలోనే 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది.