వణికిస్తున్న నివర్‌

ABN , First Publish Date - 2020-11-25T06:28:49+05:30 IST

నివర్‌ తుఫాను రైతులను పరుగులు పెట్టిస్తోంది.

వణికిస్తున్న నివర్‌
మోపిదేవిలో వరి కోతలు

నేడు, రేపు భారీవర్షాలు 

అధికారులు అప్రమత్తం

కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : నివర్‌ తుఫాను రైతులను పరుగులు పెట్టిస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ హెచ్చరికలు వెలువడడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. జిల్లాకు ఉప్పెన ముప్పు లేకున్నా, భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరిక రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. మంగళవారం నాటికి జిల్లాలో 55 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన పొలాల్లో కుప్పలు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. వర్షం కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరికి తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. బుధవారానికి నివర్‌ తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 


అధికారులు అప్రమత్తం 

నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని మండలాల్లో లోత ట్టు ప్రాంత ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో 0866-2474805,  మచిలీపట్నం కలెక్టరేట్‌లో 08672- 252572, నూజివీడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో 08656- 232717,  మచిలీపట్నం ఆర్డ్డీవో కార్యాలయంలో 08672-252486, గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో 08674- 243697 నెంబర్లతో  కంట్రోల్‌  రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.  ఆర్డీవోలు తమ పరిధిలోని తహసీల్దార్లను అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రెవెన్యూ అధికారులకు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2020-11-25T06:28:49+05:30 IST