రెవెన్యూ అధికారులకు కరెన్సీ వర్షం

ABN , First Publish Date - 2020-06-23T09:21:41+05:30 IST

మచిలీపట్నంలోని పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కరగ్రహారం గ్రామంలోని రెండు ప్రాంతాల్లో 426 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

రెవెన్యూ అధికారులకు కరెన్సీ వర్షం

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నంలోని పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కరగ్రహారం గ్రామంలోని రెండు ప్రాంతాల్లో 426 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమి విక్రయించిన వారి వద్ద ఉన్న ఆధారాలు చూపమని రెవెన్యూ అఽధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ గ్రామంలో ఎకరం భూమి ధర సుమారు 15 లక్షలు ఉంటుంది. అయితే అధికారులు మాత్రం రూ.39 లక్షలుగా నిర్ణ్ణయించారు.  ఈ లెక్కన రూ.106 కోట్లకు పైగా ప్రజాధనాన్ని పందేరం చేసేందుకు వ్యూహం రచించారు. బందరు  మండలంలో ప్రభుత్వ భూమి వేలాది ఎకరాలు ఉన్నా, భూమిని కొనుగోలు చేసేందుకే అధికారులు మొగ్గుచూపడం వారి స్వలాభాపేక్షకు అద్దం పడుతోంది.


భూమిని విక్రయించిన కొందరు రైతుల వద్ద సరైన పత్రాలు లేవు. సుమారు 70 నుంచి 80 ఎకరాలకుపైగా ఇటువంటి వారి భూములను అధికారులు గుర్తించారు. పత్రాలు సరిగాలేని రైతులతో బేరసారాలకు దిగారు. భూమి విక్రయాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఐదుగురు వీఆర్వోలతో కమిటీని వేశారు. వీఆర్వోలు, తహసీల్దారు కార్యాలయ అధికారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

బయటకు వచ్చింది ఇలా..

మచిలీపట్నానికి చెందిన ఓ కుటుంబానికి  35 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన  పత్రాలు,  పాస్‌బుక్‌లు సక్రమంగా లేకపోవడంతో అధికారులు తమదైన శైలిలో చక్రం తిప్పారు. ఆన్‌లైన్‌లో భూమికి సంబంధించిన వివరాలు సరిచేసేందుకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు  డిమాండ్‌ చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నంలో ఉంటున్న వ్యక్తికి ఐదు ఎకరాల భూమి ఉండగా, ఇందుకు సంబంధించిన పత్రాలు సక్రమంగా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో వివరాలు సరిచేసేందుకు వీఆర్వోకు సంబంధిత వ్యక్తి కొంతనగదు ఇవ్వాలని, మిగిలినది తరువాత చూసుకుందామని ఓ అధికారి చెప్పడం, అసలు వీఆర్వోకు కాకుండా వేరే వీఆర్వోకు ఈ నగదు అందజేయడంతో అవినీతి వ్యవహారం కథలు, కథలుగా బయటకు వచ్చింది. 


తహసీల్దారు కార్యాలయ వ్యవహారాల్లోకి వెళ్లి, ఆరా తీసిన కొందరు ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పెట్టడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. తహసీల్దారు కార్యాలయంలో ఎవరికివారు తమ సంగతేంటని అడగడంతో  టైపిస్టునుంచి ఆపై అధికారుల వరకు ఎవరి వాటా వారికి స్వయంగా కలసి  ఇచ్చామని  రైతులు ఫోన్‌  సంభాషణలో  చెప్పడం గమనార్హం. ఈ విషయంపై తహసీల్దారును వివరణ కోరగా, ఇళ్ల స్థలాల కోసం విక్రయించిన భూములకు సంబంధించి నగదు చెల్లింపుల్లో తమ కార్యాలయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తహసీల్దారు డి.సునీల్‌బాబు  తెలిపారు. 

Read more