ఆగని ఆక్రందనలు

ABN , First Publish Date - 2020-12-28T06:55:10+05:30 IST

కొత్త చట్టాలెన్ని తెచ్చినా, విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.

ఆగని ఆక్రందనలు

మహిళలపై మూడేళ్లుగా పెరుగుతున్న అత్యాచారాలు

పెరిగిన రాత్రి చోరీలు

గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కమిషనరేట్‌ పరిధిలో నేర గణాంకాల వార్షిక నివేదిక వెల్లడి


విజయవాడ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కొత్త చట్టాలెన్ని తెచ్చినా, విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదివారం వెల్లడించిన నేర గణాంకాలు దీనినే ధ్రువీకరిస్తున్నాయి. కమిషనరేట్‌ పరిధిలో 2018లో 50 అత్యాచార కేసులు నమోదు కాగా, 2019వ సంవత్సరంలో 52, ఈ ఏడాది 57 కేసులు నమోదయ్యాయి. 2019లో వరకట్న వేధింపులతో ఐదుగురు చనిపోగా, ఈ ఏడాది ఆ మరణాల సంఖ్య ఏడుకి పెరిగింది. గడచిన ఏడాది 11 మంది మహిళలు హత్యకు గురికాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 12కు చేరింది. మహిళలను నమ్మించి మోసం చేసిన కేసులు గత ఏడాది పది నమోదవగా, ఈ ఏడాది ఆ కేసుల సంఖ్య 16కి పెరిగింది. 


రాత్రి చోరీలూ ఎక్కువే

రాత్రి చోరీలు గత ఏడాది 124 జరగ్గా, ఈ ఏడాది 160 నమోదయ్యాయి. అత్యాచార కేసులు, రాత్రి చోరీలు తప్ప మిగిలిన అన్ని నేరాలూ తగ్గాయి.  న్యాయస్థానాల్లో శిక్షల శాతం పెరిగింది. గడిచిన ఏడాది 50శాతం, ఈ ఏడాది 55శాతం శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. లాక్‌డౌన్‌ దీనికి ఒక ప్రధాన కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. 2018లో 1494 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 365 మంది చనిపోయారు. 1472 మంది గాయపడ్డారు. 2019లో 1371 ప్రమాదాలు జరగ్గా 357 మంది ప్రాణాలు కోల్పోయారు, 1384 మంది గాయపడ్డారు. ఈ ఏడాది మొత్తం 967 రోడ్డుప్రమాదాలు జరిగాయి. వాటిలో 264 మంది చనిపోగా, మరో 948 మంది గాయపడ్డారు. 


- పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది జూలై నాటికి 8,108 కేసులు ఉండగా, ఈ నెలలో వాటి సంఖ్య 5,670గా ఉందని నివేదికలో పేర్కొన్నారు.

- 2019లో 7,935 పీటీ కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది 8,886 కేసులను నమోదు చేశారు.

- 2019లో 7,45,270 ఎంవీ యాక్ట్‌ కేసులు నమోదు చేసి రూ.9,29,32,725, ఈ ఏడాది 6,94,891 కేసులు నమోదు చేసి, రూ.9,86, 08,400 జరిమానా వసూలు చేశారు.

- గంజాయి కేసుల్లో 166 మందిని అరెస్టు చేసి, 4,135.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 


కొత్త ఏడాదిలో నూతన ప్రణాళిక 

 విజయవాడలో ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా మారింది. నగరంలో ఈ సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించడానికి కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నాం. నూతన సంవత్సరంలో దాన్ని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తాం. - బత్తిన శ్రీనివాసులు, పోలీసు కమిషనర్‌

Updated Date - 2020-12-28T06:55:10+05:30 IST