సీపీఎస్‌ రద్దు కోసం మళ్లీ సమరభేరి

ABN , First Publish Date - 2020-09-01T14:34:45+05:30 IST

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యోగులు మరో మారు పిడికిలి..

సీపీఎస్‌ రద్దు కోసం మళ్లీ సమరభేరి

నేడు భోజన విరామ సమయంలో ఆందోళనలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యోగులు మరో మారు పిడికిలి బిగిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెను సాకారం చేసుకునేందుకు బలమైన ఉద్యమ కార్యాచర ణకు శ్రీకారం చుడుతున్నారు. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తు చేయటానికి మంగళవారం జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో గంట పాటు ఆందోళనలు, ధర్నాలు, సత్యాగ్రహదీక్షలు వంటివి నిర్వహించాలని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ పిలుపు ఇవ్వటంతో ఉద్యోగులు ఉద్యమ పథంలోకి దూకారు. జిల్లా స్థాయిలో విజయవాడ, మచిలీపట్నంలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమం కూడా విజయవాడలోనే నిర్వహించనున్నారు. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్‌ శాఖ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో రాష్ట్రస్థాయి నేతలు ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీను, పశ్చిమ కృష్ణా నాయకులు విద్యాసాగర్‌ తదితరులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గంటపాటు ఎక్కడికక్కడ నిరసనలు జరగనున్నాయి.


బెజవాడ వేదికగా ఉద్యమం : 

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యమానికి బెజవాడలోనే బీజం పడింది. మూడేళ్ల క్రితం బెజవాడ వేదికగా అన్ని జేఏసీలు ఐక్యంగా గర్జించాయి. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. దశల వారీగా ఉద్యమాలకు రూపకల్పన జరిగింది. ఆ తర్వాత జేఏసీలు వేర్వేరుగా విడిపోయినా, సీపీఎస్‌ పోరు మాత్రం ఆగలేదు. సీపీఎస్‌ను రెండు నెలల్లో రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటారనుకుంటే 14 నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. దీంతో సీపీఎస్‌ అంశాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.


ఉపాధ్యాయ సంఘాల మద్దతు

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగులు నిర్వహించే పోరాటానికి యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, టీఎన్‌యూఎస్‌, ఎస్‌టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాలని నిర్ణయించాయి. సీపీఎస్‌ రద్దు విషయంలో కమిటీలతో కాలయాపన చేయొద్దని, పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ ఇచ్చిన హామీనే అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌కు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌.లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ఓ లేఖ ద్వారా విజ్ఞప్తిచేశారు.కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుపై ఉద్యోగ సంఘాలన్నీ కలిసికట్టుగా పోరాడాయి. ప్రభుత్వం కూడా దీనిని రద్దు చేయటానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి నెరవేరుస్తుందన్న నమ్మకం ఉంది. ఒక నెలలో అవుతుందనుకున్నది 14 నెలలు గడిచినా కాకపోవటంతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యోగుల భయాందోళనలను తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఒక రోజు భోజన విరామ ఆందోళనలకు పిలుపు ఇచ్చాం. 

- విద్యాసాగర్‌, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో పశ్చిమ కృష్ణా 


Updated Date - 2020-09-01T14:34:45+05:30 IST