జీతాలు చెల్లించకపోవడంతో.. ఆందోళనబాట పట్టిన కొవిడ్‌ ‘వార్‌’యర్స్‌..!

ABN , First Publish Date - 2020-12-11T06:15:36+05:30 IST

జీతాలు చెల్లించకపోవడంతో.. ఆందోళనబాట పట్టిన కొవిడ్‌ ‘వార్‌’యర్స్‌..!

జీతాలు చెల్లించకపోవడంతో.. ఆందోళనబాట పట్టిన కొవిడ్‌ ‘వార్‌’యర్స్‌..!
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంత్రి ఆళ్ల నానీని చుట్టుముట్టిన కాంట్రాక్టు వైద్యులు

వేతనాల కోసం ఆందోళన 

రైల్వేస్టేషన్‌ వద్ద ఐమాక్స్‌ బస్సుల సిబ్బంది నిరసన 

పెట్రోల్‌ సీసాతో యువకుడి ఆత్మహత్యాయత్నం  

జీజీహెచ్‌ వద్ద మంత్రిని చుట్టుముట్టిన కాంట్రాక్టు వైద్యులు 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు జీతాలు చెల్లించకపోవడంతో విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. గురువారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానీని అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులు చుట్టుముట్టి తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న వీరా బస్సు వద్ద ప్రైవేట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఓ యువకుడు పెట్రోలు సీసాతో వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి.. జిల్లాలో ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు నమూనా (స్వాబ్‌)లు సేకరించే బాధ్యతలను ప్రభుత్వం ‘వీరా’ సంస్థకు అప్పగించింది.


ఆ సంస్థ జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, శాంపిల్స్‌ తీసుకునే టెక్నీషియన్లుగా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకుని గత మార్చి నెల నుంచి ఐమాక్స్‌ బస్సుల్లో విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్‌ పరీక్షల కోసం నియమించింది. ఇలా జిల్లాలో మొత్తం 24  బస్సుల్లో 150 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వీరికి ‘వీరా’ సంస్థ దాదాపు ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది రెండు నెలలుగా విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఉద్యోగి పెట్రోలు నింపిన సీసాను చూపిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సహచర సిబ్బంది అతడ్ని వారించారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి యువకుడితో సహా ఈ నిరసనలో పాల్గొన్న దాదాపు 20 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.



Updated Date - 2020-12-11T06:15:36+05:30 IST