కొవిడ్ వ్యాక్సిన్ ప్లానింగ్!
ABN , First Publish Date - 2020-12-01T06:33:37+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వైద్య, సంబంధిత అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు.

పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
విజయవాడ సిటీ : కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వైద్య, సంబంధిత అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కొవిడ్-19 జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగింది. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై వైద్య, విద్య, పురపాలక, ఐసీడీఎస్ తదితర శాఖాధికారులతో కలెక్టర్ ఈ సందర్బంగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ నిల్వ చేయడం, పంపిణీలో అనుసరించాల్సిన శీతలీకరణ పద్ధతులు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సిన్ పీహెచ్‌సీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలో రెండు ప్రత్యేక వాహనాలను గుర్తించామన్నారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడంతో పాటు, అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు తరలించడం కీలకమన్నారు. దీనికి సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. జేసీ ఎల్.శివశంకర్, డీఎంఅండ్ హెచ్‌వో సుహాసిని, డీఈవో రాజ్యలక్ష్మి, వీఎంసీ వీసీడీ జె.అరుణ, ఐసీడిఎస్ పీడీ ఉమారాణి, నగర సీఎంవో గీతాబాయి, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రేపు మహిళా మార్చ్‌పై అవగాహన ర్యాలీ
మహిళా మార్చ్ 100 రోజులపై అవగాహన ర్యాలీని బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఉమారాణిని కలెక్టర్ ఆదేశించారు. 100 రోజుల ఈ కార్యాచరణ మహిళాంధ్రప్రదేశ్ సాధనకు మరో ముందడుగు కావాలన్నారు.