మచిలీపట్నంలో నేడు 24 గంటల కర్ఫ్యూ
ABN , First Publish Date - 2020-04-05T09:05:25+05:30 IST
చిలకలపూడిలో కోవిడ్ - 19 పాజిటివ్ కేసు..

4 నుంచి 10 వార్డుల వరకు రెడ్‌జోన్
ఇళ్లకే నిత్యావసరాలు : మంత్రి పేర్ని నాని
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : చిలకలపూడిలో కోవిడ్ - 19 పాజిటివ్ కేసు శనివారం నమోదైందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నంలో పాజిటివ్ కేసు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. నగరంలో ఆదివారం పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించామన్నారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలోని కొత్త డివిజన్లు 4,5,6,7,8,9,10లో ఐదు రోజుల పాటు కర్ఫ్యూ విధించామన్నారు. నవీన్‌మిట్టల్ కాలనీ, సీతయ్యనగర్, హమాలీ కాలనీల్లో కూడా కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ డివిజన్లలోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు.
ప్రజలకు అవసరమైన మందులు, కూరగాయలు, నిత్యావసరాలు ఇంటి వద్దకే తీసుకువచ్చి ఇస్తారని, వాటికి సొమ్ము చెల్లించాలన్నారు. పాలు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అందజేస్తామన్నారు. నిత్యావసరాలు, మందులు, కూరగాయలను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇస్తారన్నారు. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తితో కలిసి తిరిగిన వారంతా స్వీయ గృహ నిర్బంధానికే పరిమితం కావాలన్నారు. వీరిలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే అధికారులు వలంటీర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో ఇద్దరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. ఒకటి రెండు రోజుల్లో వారిని క్వారంటైన్ నుంచి గృహ నిర్బంధానికి పంపుతామన్నారు.
నిర్ధారిత రేట్లకే నిత్యావసరాలు : ఎస్పీ
మచిలీపట్నం టౌన్ : ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కోనేరు సెంటర్లోని కిరాణా షాపులను ఎస్పీ సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు, బియ్యం కొనుగోళ్లలో ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మామిడి మురళీకృష్ణ మాట్లాడుతూ, ఆదివారం షాపుల్లో ప్యాకింగ్‌కు అనుమతిస్తే సోమవారం ఉదయం నుంచి ప్రజలకు సరుకులు అందిస్తామన్నారు. దివ్యాంగులు 9885669486కు ఫోన్ చేస్తే రవాణా చార్జీలు లేకుండా నిత్యావసర వస్తువులు, మందులు పంపిణీ చేస్తామని ఫ్రీసా సీఈవో డి.జయవీర్ తెలిపారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం నాయకులు రఘు డిమాండ్ చేశారు. మెప్మా పీడీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో 34 గ్రామాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
కమిషనర్ సమీక్ష ..
రెడ్అలెర్ట్ ప్రకటించినందున ఐదు రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదివారం కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్ఫ్యూ సమయంలో తప్పనిసరిగా ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు.
సీఎం సహాయ నిధికి రూ. లక్ష అందజేత
కృష్ణవేణి ఐటీఐ కరస్పాండెంట్ కొత్తగుండు రమేష్ సీఎం సహాయ నిధికి రూ. లక్ష చెక్కును మంత్రి పేర్ని నానికి అందజేశారు. బెరాకా మినిస్ర్టీస్ ఆధ్వర్యంలో మురికివా డలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి పేర్ని నాని జెండా ఊపి ప్రారంభించారు. బెరాకా మినిస్ర్టీస్ అధినేత కిరణ్‌పాల్ మాట్లాడుతూ, 300 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అంద చేస్తున్నామన్నారు. డీఎస్పీ ఎండీ మెహబూబ్ బాషా, ఆర్‌పేట సీఐ పాల్గొన్నారు.