అన్నీ తామై!
ABN , First Publish Date - 2020-04-28T09:12:20+05:30 IST
కరోనా వైరస్ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుడుతోంది.. అయితే వైరస్ సోకినవారి ప్రాణాలను కాపాడేందుకు

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
కరోనా వైరస్ పేరు వింటేనే ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుడుతోంది.. అయితే వైరస్ సోకినవారి ప్రాణాలను కాపాడేందుకు విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులతోపాటు నాలుగో తరగతి ఉద్యోగులైన ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలు సైతం వెలకట్టలేని సేవలందిస్తున్నారు. ఇది ప్రాణాంతక వైరస్ కావడంతో చికిత్స పొందుతున్న పాజిటివ్ రోగుల వద్దకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూల్లో మృత్యువుతో పోరాడుతున్న రోగులకు అన్నీ తామై సేవలందిస్తున్న ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలు, పారిశుధ్య కార్మికుల సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే!
స్వాబ్ తీయడం మొదలు..
వీరు నెలకు కేవలం రూ.10 వేలు వేతనం తీసుకునే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే కావచ్చు కానీ.. కరోనా రోగులకు వారు చేస్తున్న సేవలు ఔట్‌స్టాండింగ్ అని చెప్పకతప్పదు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్న రోగుల నుంచి స్వాబ్ (శాంపిల్) తీయడం మొదలుకొని.. ఇన్‌పేషెంట్లకు సెలైన్ పెట్టడం, బీపీ, షుగరు చెక్ చేయడం, మంచినీళ్లు, భోజనాలు అందించడం, దుస్తులు మార్చడం, యూరిన్ ట్యూబులు వేయడం, నిండిన బ్యాగులను తొలగించి కొత్తవి పెట్టడం, ఎప్పటికప్పుడు బెడ్‌షీట్లు మార్చడం... ఇలాంటి పనులన్నీ వారే చేస్తున్నారు. శాంపిల్స్ తీయడం, బీపీ, షుగరు లెవెల్స్ పరిశీలించడం వంటివి వైద్యులు, నర్సులు చేయాల్సిన పనులైనప్పటికీ.. ఆ పనులను కూడా ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలతోనే చేయిస్తున్నారు. ఎవరైనా మృతి చెందితే, ఆ మృతదేహాల నుంచి స్వాబ్ (శాంపిల్స్)ను వైద్యులు, నర్సులు దగ్గరుండి మరీ వీరితోనే తీయిస్తున్నారు.
భోజనం అడిగితే కాదు పొమ్మంటారా?
దూరప్రాంతాల నుంచి అనేక వ్యయప్రయాసలకోర్చి వచ్చి, ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలందిస్తున్న తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోగా.. కనీసం భోజనాలైనా ఏర్పాటు చేయాలని అడిగితే ఆసుపత్రి ఉన్నతాధికారులు కాదు పొమ్మంటున్నారని ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలు, పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. ఆసుపత్రిలో క్యాంటిన్ మూసివేయడంతో టీ, కాఫీలు కూడా దొరకడం లేదని తెలిపారు. ఇక్కడ ఎంత కష్టపడి పని చేసినా తమ సేవలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కటింగ్‌లన్నీ పోను నెలకు రూ.10 వేలు జీతం వస్తుందని, దాంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. కరోనాపై పోరాడుతున్నవారికి రెండు భత్యాలు ఇస్తారని చెప్పినా, తమకు ఇవ్వడం లేదని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఎంత చేసినా చిన్నచూపే
విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో దాదాపు 40 రోజులుగా కరోనా రోగులకు వెలకట్టలేని సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఆసుపత్రి ఉన్నతాధికారులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలు 60 మంది వరకు ఉన్నారు. వీరిలో 10 మందిని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఓపీ విభాగానికి పంపించారు. మిగిలిన 50 మందిలో 40 మంది ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు వారం పని చేస్తే రెండు వారాలు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. వారితోపాటే రోగులకు సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రం సెలువులు లేవు. వీరు తక్కువ సంఖ్యలో ఉండటంతో అవిశ్రాంతంగా పని చేయిస్తున్నారు.
అంతిమ సంస్కారాలు నిర్వహించేదీ వారే..
కరోనా రోగులు ఆసుపత్రిలో మరణిస్తే మృతదేహాలను నిబంధనల ప్రకారం కొవిడ్-19 బాడీప్యాక్ కవర్‌లో జాగ్రత్త చేసి, మార్చురీలో భద్రపరచాలి. వైద్యపరీక్షల్లో పాజిటివ్ వస్తే ఆ మృతదేహాలను ఎమ్మెన్వోలు, ఎఫ్‌ఎన్వోలే కృష్ణలంకలోని విద్యుత్ శ్మశానవాటికకు తీసుకువెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేయించి వస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు ఏ మతానికి చెందిన వారైతే ఆ మతాచారాల ప్రకారం వీరే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు.