-
-
Home » Andhra Pradesh » Krishna » Corona vibe
-
స్వయంకృతాపరాధం
ABN , First Publish Date - 2020-03-24T09:51:26+05:30 IST
కరోనా ప్రకంపనలు పుట్టిస్తుంటే నగరవాసుల్లో..

ఏమైంది పౌరస్పృహ..?
స్వీయ నిర్బంధం వదిలి బయటకొచ్చిన నగర ప్రజ
పట్టని లాక్‌డౌన్
అత్యవసరమంటూ పోలీసులతో వాగ్వివాదం
రైతుబజార్లలో కనిపించని నియంత్రణ
జాతీయ రహదారిపై వాహనాల క్యూ
స్పందించిన పోలీసులు.. మరింత కట్టడి
మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రకంపనలు పుట్టిస్తుంటే నగరవాసుల్లో పౌరస్పృహ కొరవడింది. ప్రపంచ దేశాలు ఈ వైరస్‌తో అల్లాడిపోతుంటే విజయవాడ వాసులు మాత్రం కరోనాను తేలిగ్గా తీసుకున్నారు. జనతా కర్ఫ్యూలో కనిపించిన స్పందన లాక్‌డౌన్‌లో కనిపించలేదు. మార్చి నెలాఖరు వరకు సర్వం లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బెజవాడ ప్రజలు పట్టించుకోలేదు. ఉదయం నుంచే యథావిధిగా రహదారులపైకి వచ్చేశారు.
వ్యాపారుల లాభాపేక్ష ముందు లాక్‌డౌన్ నిలబడలేదు. కొంతమంది వ్యాపారులు తొమ్మిది గంటలకు షాపులు తెరిచారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ఉద్యోగాలకు బయల్దేరారు. వన్‌టౌన్‌లో పాజిటివ్ కేసు నమోదైన తర్వాత నగరంలో మరింత హై అలర్ట్ ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు శాఖ ప్రకటించింది. పోలీసుల ఆదేశాలు గానీ, జిల్లా అధికారులు చేసిన సూచనలు గానీ నగరవాసులకు పట్టలేదు. ఆంక్షలు ఉన్నా ప్రజలు రహదారులపైకి రావడంతో అధికారులు తలపట్టుకున్నారు.
జాతీయ రహదారిపై వాహనాల క్యూ
అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ భారీ వాహనాలు జాతీయ రహదారులపైకి వచ్చేశాయి. ఇటు హైదరాబాద్, అటూ చెన్నై జాతీయ రహదారిపై నుంచి లారీలు, కంటైనర్లు నగరంలోకి వచ్చాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కనిపించింది. ఈ వాహనాల తాకిడికి ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. గంటల తరబడి లారీలను, కంటైనర్లను బెంజిసర్కిల్ కూడలిలో నిలుపుదల చేశారు. ఇలా దఫదఫాలుగా విడుదల చేసి వదిలిపెట్టారు.
అందరిదీ అదే కారణం
ఆదివారం రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తే సోమవారం మాత్రం వాహనాలతో నిండిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులు, వ్యాపారులు, వాణిజ్య సంస్థల్లో పనిచేసేవారు యథావిధిగా రహదారులపైకి వచ్చారు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు పదేపదే మైకుల్లో ప్రకటించినా వాహనదారులు పట్టించుకోలేదు. ఆటోలు మామూలుగా ప్రయాణికులతో రాకపోకలు సాగించాయి. అన్ని కూడళ్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలుపుదల చేశారు. దీంతో పోలీసులతో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. ఉపకమిషనర్లు హర్షవర్థన్‌రాజు, విక్రాంత్ పాటిల్, నాగరాజు, అదనపు ఉపకమిషనర్ బి.రవిచంద్ర నగరంలో పరిస్థితిని పరిశీలించారు.
రహదారులపైకి వచ్చిన వాహనదారులంతా ఆస్పత్రులకు వెళ్తున్నామని, మందుల షాపులకు వెళ్తున్నామని అత్యవసర కారణాలను చెప్పారు. ఎక్కువమంది ఇదే కారణం చెప్పడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ఇక పటిష్టంగా కట్టడి చేయాలని నిర్ణయించారు. వాహనాలను గంటల తరబడి ఆయా కూడళ్లలో నిలిపివేయడంతో ఎవరికివారు వెనుదిరిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పరిస్థితి అదుపులోకి వచ్చింది. చాలా స్వల్పంగా వాహనదారులు కనిపించారు. దీనిపై పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతుబజార్లలో పరిస్థితి భయంకరంగా కనిపించింది. వ్యాపారులపై వినియోగదారులు గుంపులుగుంపులుగా పడిపోయారు. అన్ని కూరగాయలు అందుబాటులో లేవని ప్రజలు మండిపడ్డారు. సాయంత్రానికి అధికారులు కూరగాయల స్టాకును రప్పించారు.