మళ్లీ అలజడి
ABN , First Publish Date - 2020-05-19T08:32:47+05:30 IST
జిల్లాలో కరోనా మరో ఇద్దరిని బలిగొంది. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఆ మహమ్మారి బలైపోయారు.

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కరోనా మరో ఇద్దరిని బలిగొంది. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఆ మహమ్మారి బలైపోయారు. వీరిలో ఒకరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కిందిస్థాయి ఉద్యోగి కాగా, మరొకరు గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో వ్యాపారి. పాతబస్తీలోని కొత్తపేట, కృష్ణలంకల్లో నివసిస్తున్న వీరిద్దరూ ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు మరణించారు. వీరి మృతదేహాలకు ఆసుపత్రి సిబ్బందే స్వర్గపురిలో దహన సంస్కారాలు నిర్వహించారు. వీరిద్దరి మరణాలను ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా సోమవారం ఒక్క రోజే జిల్లాలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 382కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 15 మంది కరోనాతో మరణించగా.. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఇప్పటి వరకు 263 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కృష్ణలంకలో మళ్లీ కలకలం
కృష్ణలంకలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. సోమవారం కొత్తగా నమోదైన 15 పాజిటివ్ కేసుల్లో 11 కేసులు కృష్ణలంకలోనివే. వీటితో కలిపి ఇప్పటి వరకు కృష్ణలంకలో కరోనా బారినపడినవారి సంఖ్య 125కు చేరుకుంది. సోమవారం నమోదైన కేసులను పరిశీలిస్తే.. కృష్ణలంక రణదివెనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి, అదే ప్రాంతంలో కార్పెంటర్‌గా పనిచేసే మరో వ్యక్తి, 35 సంవత్సరాల మరో గృహిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలిక, ఒడియా హాస్పిటల్ సమీపంలో ఎక్స్-రే డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరైన వ్యక్తి కరోనా బారినపడ్డారు. కల్పన ప్రింట్స్ రోడ్డుకు చెందిన సిటీ కేబుల్ సబ్ కాంట్రాక్టర్, 50 సంవత్సరాల గృహిణికి కరోనా సోకింది. కోత మిషన్ రోడ్డులో 66 సంవత్సరాల వృద్ధురాలికి వైరస్ సోకింది. గౌతమినగర్ మొదటి వీధిలో టిఫిన్ బండిని నడుపుకుంటున్న భార్యాభర్తలకు పాజిటివ్‌గా తేలింది. గంగానమ్మ గుడి ప్రాంతంలో 49 సంవత్సరాల గృహిణికి వైరస్ సోకింది. జక్కంపూడిలోని వైఎస్‌ఆర్ కాలనీలో 14 సంవత్సరాల బాలిక, 18 సంవత్సరాల యువతి కరోనా బారినపడ్డారు.
ఐఏఎస్ అధికారి కార్యాలయ ఉద్యోగులిద్దరికి కరోనా!
విజయవాడ నగరంలోని ఒక ఐఏఎస్ అధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. దీంతో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అయితే వారిద్దరికీ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు ధ్రవీకరించలేదు. వారిని ఐసోలేషన్‌కు కూడా తరలించలేదు.
హోల్‌సేల్ మార్కెట్‌లో కరోనా కేసుల కలకలం
విద్యాధరపురం : గొల్లపూడిలోని మహాత్మగాంధీ హోల్‌సేల్ మార్కెట్‌లో వ్యాపారి కరోనాతో మృత్యువాత పడినట్టు తెలిసి ఇతర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో లారీ ఆఫీసులు, డైలీ పార్శిల్ సర్వీసులు ఎక్కువగా ఉండటం, డ్రైవర్లు, క్లీనర్లు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందుతోందని పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.