కరోనా.. రవాణా..

ABN , First Publish Date - 2020-03-21T10:08:06+05:30 IST

కరోనా.. రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్టీసీ, రైల్వే, విమానయాన రంగాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. కోల్పోతున్న ఆదాయం కంటే కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే అంశాలపై రవాణా రంగం దృష్టిసారించింది.

కరోనా.. రవాణా..

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం వద్ద ప్రత్యేక చర్యలు

లాభనష్టాలను బేరీజు వేయకుండా అవగాహన కార్యక్రమాలు

అవేర్‌నెస్‌ బోర్డులు, అనౌన్స్‌మెంట్లు

నిత్యం పరిశుభ్రత


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కరోనా.. రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆర్టీసీ, రైల్వే, విమానయాన రంగాల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. కోల్పోతున్న ఆదాయం కంటే కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనే అంశాలపై రవాణా రంగం దృష్టిసారించింది. ప్రయాణికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేయాల్సినవి ఏమిటి? చేయకూడనివి ఏమిటి? వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? అనే అంశాలతో ప్రచారం నిర్వహిస్తోంది. 


పీఎన్‌బీఎస్‌లో అవగాహన

పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు వచ్చే వారికోసం అరైవల్‌, డిపార్చర్‌ బ్లాకుల్లో ప్లాట్‌ఫాంల వద్ద అడుగడుగునా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. బుకింగ్‌ కేంద్రాలు, సమాచార కేంద్రాలు, స్టాళ్లు, డార్మిటరీలు.. ఇలా ప్రతిచోటా ప్రచారం చేస్తున్నారు. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాకుల్లో ఐదు భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లపై కొవిడ్‌ వైరస్‌ సందేశాలను ఇస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనౌన్స్‌మెంట్‌ ద్వారా చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ అవగాహన కొనసాగుతోంది. బస్టాండ్‌ ప్రాంగణాన్ని నిత్యం శుభ్రంగా ఉంచుతున్నారు. 


రైల్వేస్టేషన్‌లో విస్తృత ప్రచారం

విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అడుగడుగునా కరోనాకు సంబంధించిన జాగ్రత్తలతో వినైల్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, వెయిటింగ్‌ హాళ్లు, రిటైరింగ్‌ రూమ్‌లు.. ఇలా అన్నింటా ప్రచార బోర్డులు సిద్ధం చేశారు. జాగ్రత్తల గురించి అనౌన్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్‌ బోర్డులపై కూడా ప్రచారం చేస్తున్నారు. స్టేషన్‌ ప్రాంగణంలో హైపో క్లోరైడ్‌తో క్యూమిగేషన్‌ చేస్తున్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేశాకే బెడ్‌షీట్లను అందిస్తున్నారు.


విమానాశ్రయంలో అవేర్‌నెస్‌

విమానాశ్రయం బయటి ఆవరణ నుంచే అవేర్‌నెస్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. అరైవల్‌, డిపార్చర్‌.. ఇలా అడుగడుగునా ప్రచార బోర్డులు సిద్ధం చేశారు. ఫ్లైట్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డుల ద్వారా కరోనా జాగ్రత్తలను వివరిస్తున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది పర్యవేక్షణలో నూరుశాతం థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించటంతో పాటు ప్రత్యేక ఐసోలేషన్‌ అంబులెన్స్‌, క్వారంటైన్‌ ఐసోలేషన్‌ గదులు సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే బస్సుల్లో సోడియం హైపో క్లోరైడ్‌ను స్ర్పే చేస్తున్నారు. 


అప్రమత్తత కోసం వాట్సాప్‌ గ్రూప్‌

కరోనాపై అనుక్షణం అప్రమత్తత కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసింది. ఈ గ్రూపులో జిల్లాల కలెక్టర్లతో పాటు ఎయిర్‌పోర్టు డైరెక్టర్లు, డీఆర్‌ఎంలకు అవకాశం కల్పించారు. వీరికి అడ్మిన్‌ హోదా ఇచ్చారు. ప్రాంతీయంగా రవాణా రంగానికి సంబంధించిన వారిని ఈ అడ్మిన్లు సభ్యులుగా చేర్చుకోవచ్చు. కరోనాపై నిరంతరం అప్రమత్తంగా ఉంచడానికే దీనిని ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-03-21T10:08:06+05:30 IST