కరోనా కల్లోలం
ABN , First Publish Date - 2020-04-05T09:03:16+05:30 IST
జిల్లాలో శుక్రవారం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు కాస్త ఊపిరి తీసుకునేలోపే మహమ్మారి మరింత విజృంభించి ఏకంగా మరణ మృదంగమే మోగించింది.

క్వారంటైన్‌లో ఉన్న బందరువాసి మృతి
కరోనా లక్షణాలతో విజయవాడ వాసి కూడా..
జిల్లాలో 32కు చేరిన పాజిటివ్ కేసులు
శనివారం ఒక్కరోజే 9 కేసులు నమోదు
కానూరు, జగ్గయ్యపేట, నందిగామలకూ విస్తరించిన మహమ్మారి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో శుక్రవారం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు కాస్త ఊపిరి తీసుకునేలోపే మహమ్మారి మరింత విజృంభించి ఏకంగా మరణ మృదంగమే మోగించింది. క్వారంటైన్‌లో ఉన్న బందరు వాసి శనివారం మృతి చెందడం కలకలం రేపింది.
జిల్లావ్యాప్తంగా శనివారం 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ శివారు కానూరు, జగ్గయ్యపేట, నందిగామ మండలం రాఘవాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మందికి తాజాగా కరోనా పాజిటివ్ రాగా.. వీరందరూ ఢిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారే. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32కు చేరుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయంతో వణికిపోతుంటే.. తాజాగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగించింది.
మచిలీపట్నానికి చెందిన వ్యక్తి శనివారం కరోనాతో మృతి చెందారు. ఇది జిల్లాలో రెండో కరోనా మరణం. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయవాడకు చెందిన మరో వ్యక్తి ఆసుపత్రిలో శనివారం ఉదయం మృతి చెందాడు. తీవ్రమైన దగ్గు, ఆయాసంతో ఆసుపత్రికి వచ్చిన ఆ వ్యక్తి కొద్ది గంటలకే మృతి చెందడంతో ఇది కూడా కరోనా మరణంగానే భావిస్తున్నారు. వైద్యులు అతని శాంపిళ్లను పరీక్షలకు పంపించారు.
నిర్లక్ష్యమే మృతికి కారణం
మచిలీపట్నం చిలకలపూడికి చెందిన వ్యక్తి(45) రోల్డ్‌గోల్డ్ వ్యాపారి. వ్యాపారం నిమిత్తం వారం, పది రోజులకొకసారి బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుండేవాడు. కొద్దిరోజుల క్రితం అతడు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా తెలిసిన ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించాడు. ఐదు రోజు ల పాటు చికిత్స పొందినా దగ్గు, ఆయాసం తగ్గకపోవడంతో ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నంలోని ప్రభుత్వాసు పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కరోనాగా అనుమానించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించడంతో పాటు ఆ వ్యక్తి శాంపిళ్లను వ్యాధి నిర్ధారణకు పంపారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడకు తరలించారు. అయితే సాయంత్రానికే అతడు మృతి చెందాడు.
అయితే అతడికి చికిత్స చేసిన ప్రైవేటు వైద్యుడు స్వచ్ఛందంగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చి శాంపిల్స్ ఇచ్చి, అనంతరం ఆయన స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లిపోయా రు. మరణించిన వ్యక్తి కొద్ది రోజుల పాటు తాను పనిచేసే కంపెనీలోను, స్నేహితులతో సరదా గడిపినట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరెవరిని కలిశాడు తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి తగిన చికిత్స తీసుకుని ఉంటే ప్రాణాలు పోయేవికావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా లక్షణాలతో విజయవాడ వాసి మృతి
బెజవాడ ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి (56) తీవ్రమైన దగ్గు, ఆయాసంతో శనివారం తెల్లవారు జామున ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. అయితే ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటలకే మరణించాడు. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యులు అతడి శాంపిల్స్‌ను సేకరించి వ్యాధి నిర్ధారణకు పంపారు. తీవ్రమైన దగ్గు, ఆయాసం వంటి కరోనా లక్షణాలతోనే మరణించడంతో అతనిది కూడా కరోనా మరణంగానే భావిస్తున్నారు. వైద్యులు కూడా అతడి మృతదేహాన్ని కరోనాతో మృతి చెందిన వారికి తీసుకునే జాగ్రత్తలు తీసుకుని బంధువులకు అప్పగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. వైద్యుల సూచన మేరకు శనివారం సాయంత్రం కృష్ణలంకలోని విద్యుత్ శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేశారు.
జిల్లాలో తొలి కరోనా మరణం కూడా ఇదే విధంగా మార్చి 30న సంభవించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లిన విద్యాధరపురానికి చెందిన చెందిన వ్యక్తి మృతి చెందాడు. అతని శాంపిల్స్‌ను పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. శనివారం మరణించిన వ్యక్తి కూడా ఇలాగే మరణించడంతో కరోనా మరణంగానే భావిస్తున్నారు. ఆ వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడని, ఈ క్రమంలో అతడు అనేక మందితో సన్ని హితంగా మెలిగి ఉంటాడని, ఎవరెవరిని కలిశాడనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పాజిటివ్ కేసులతో కలకలం
జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో శనివారం 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు విజయవాడ శివారు కానూరు, సనత్‌నగర్‌లో నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం రేగింది. కానూరు పాముల వెంకయ్యవీధికి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చాడు. అతడి కుమారుడికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం ది. స్థానికంగా అతడు మత పెద్ద కావడం గమనార్హం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అతడు చాలా మందిని కలవడంతో పాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొన్నాడు. అంతేకా కుండా జీవనోపాధి నిమిత్తం కానూరు, తులసీనగర్ ప్రాంతాల్లో టెంట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు.
బీహార్ నుంచి వచ్చిన కొంతమంది అతడి దగ్గర పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. వ్యాపార పనుల మీద, మతపరమైన కార్యక్రమాల్లోనూ రోజూ చాలా మందితో సన్నిహితంగా అతడు మెలగడంతో కానూరు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే సనత్‌నగర్ రేకుల షెడ్డు ప్రాం తానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ మత కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన ఆ వ్యక్తి వారం, పది రోజులుగా చాలా మందిని కలిశాడని చెబుతున్నారు. కుటుంబసభ్యులతో పాటు ఎంతమందిని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.
రాఘవాపురానికి రాకపోకలు బంద్
రాఘవాపురం(నందిగామ రూరల్): మండలంలోని రాఘవాపురంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్త మయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. దీంతో అతడిని గన్నవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహించటంతో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు శనివారం పోలీసులు గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి రాకపోకలు సాగించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ వ్యక్తి తల్లి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా ఉన్నారు. గ్రామంలో వారు ఎవరెవరిని కలిశారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.
జగ్గయ్యపేటలో మరో కేసు
జగ్గయ్యపేట: పట్టణంలో మూడో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని తహసీల్దార్ రామకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నాయీ బ్రాహ్మణబజార్‌లో ఉండే ఆ వ్యక్తి కుటుంబసభ్యులను గరికపాడు కేవీకేలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో శనివారం ప్రత్యేక శానిటేషన్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న జగ్గయ్యపేటలో రెండో రోజు శనివారం కర్ఫ్యూ కొనసాగింది. పాలు, కూరగాయల కొనుగోలుకు మాత్రమే అనుమతించారు. రైతుబజార్ ఆధ్వర్యంలో ఆరు ఆటోల్లో కూరగాయలను విక్రయించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల్లో శానిటేషన్‌ను ప్రభుత్వ విప్ ఉదయభాను పర్యవేక్షించారు.
కరోనాను గెలిచి.. విజేతగా నిలిచి..
జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసుగా నమోదైన విజయవాడ పాతబస్తీకి చెందిన యువకుడు కరోనా మహమ్మారితో పోరాడి గెలిచాడు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పద్నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆ యువకుడికి రెండు సార్లు నెగెటివ్ రిపోర్టు రావడంతో అధికారులు శనివారమే అతనిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.