ఇంత వ్యత్యాసమా!

ABN , First Publish Date - 2020-06-23T09:22:47+05:30 IST

ఒక పక్క అధికారులు తమ నివేదికల్లో కరోనా తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో పక్క కలెక్టరు ..

ఇంత వ్యత్యాసమా!

జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతున్నా, ప్రభుత్వం అంకెల గారడీతో వైరస్‌ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 15 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనట్లు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొనగా అనధికారిక సమాచారం ప్రకారం అంతకు రెట్టింపు కేసులు నమోదయినట్టు తెలుస్తోంది.  జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1063గా, కరోనా మరణాల సంఖ్య 37గా బులెటిన్‌లో ప్రకటించగా, కలెక్టర్‌ లెక్క ఇందుకు భిన్నంగా ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ):  ఒక పక్క అధికారులు తమ నివేదికల్లో కరోనా తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో పక్క కలెక్టరు ఇంతియాజ్‌ జిల్లాలో కరోనా వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, ఇప్పటి వరకు 64,110 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. 684 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని, 405 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కరోనా మరణాల వివరాలను వెల్లడించలేదు. బులెటిన్‌ ప్రకారం కోలుకున్న వారి సంఖ్యకు, కలెక్టర్‌ రిపోర్టుకు కూడా భారీ వ్యత్యాసం ఉంది. ఇప్పటివరకు 463 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకోగా.. 563 మంది చికిత్స పొందుతున్నట్లు బులెటిన్‌లో ప్రకటించారు. 


రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాలకు, కలెక్టరు చెప్పిన కరోనా వివరాలకు ఎక్కడా పొంతన లేదనే విషయం వారు ప్రకటించిన అంకెలను పరిశీలిస్తేనే అర్థమవుతోంది. వారం రోజులుగా జిల్లాలో 50 నుంచి 100 మధ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. సోమవారం ఒక్కసారిగా 15 కేసులకు తగ్గిపోవడం వెనుక ఉన్నది ప్రభుత్వం, అధికారులు ప్రదర్శిస్తున్న అంకెల మాయాజాలమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బందరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సోమవారం కొత్తగా మరో ఐదుగురికి, నూజివీడు పట్టణంలో మరో తొమ్మిది మందికి, విస్సన్నపేటలో ఒక రెవెన్యూ అధికారికి వైరస్‌ సోకినట్లు ఆ మండల అధికారులు నిర్ధారించారు. ఆ రెండు డివిజన్లలోనే 15 కేసులు నమోదు కాగా, విజయవాడ నగరంలోను, శివారు ప్రాంతాల్లో మరో 22 మందికి పైగా కరోనా పడినట్లు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 


విజయవాడ నగరంలోని కృష్ణలంక, చిట్టినగర్‌, భవానీపురం, తాడిగడప, గన్నవరం తదితర ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో మాత్రం 15 పాజిటివ్‌ కేసులనే ప్రకటించడం గమనార్హం. విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ కార్పొరేటర్‌ అభ్యర్థితోపాటు ఐదుగురు కరోనా పాజిటివ్‌ బాధితులు ఆదివారం ఉదయం మరణించారు. అయితే గడచిన 24 గంటల్లో జిల్లాలో ఒక్కరు మాత్రమే మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొనడం గమనార్హం.


బందరుడివిజన్‌లో ఐదు కేసులు

 ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : బందరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సోమవారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కరోనా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఈడేపల్లి, ఇనగుదురుపేట, జవ్వారుపేట,  సర్కారుతోట ప్రాంతాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు, పెడనమండలం నడుపూరులో ఒక కేసు  నమోదయ్యాయన్నారు.  బందరు డివిజన్‌లో ఇప్పటి వరకు 63 కరోనా పాజిటివ్‌ కేసులు న మోదైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం,  తహసీల్దారు సునీల్‌బాబు,  సీఐలు వెంకటనారాయణ, కొండయ్య పాల్గొన్నారు. 


జగ్గయ్యపేటలో మరో 3  కేసులు

జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో సోమవారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని శాంతినగర్‌లో రెండు, కాకానినగర్‌లో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పారు. ఆదివారం మూడు కేసులతో కలిపి మొత్తం ఆరు కేసులు వచ్చినట్టు వివరించారు. 


నూజివీడులో తొమ్మిది కేసులు

నూజివీడు, జూన్‌ 22 : నూజివీడు పట్టణంలో తొమ్మిది, విస్సన్నపేటలో ఒక కరోనా కేసు వెలుగు చూశాయి. నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలో తొలిసారిగా సోమవారం ఒక రెవెన్యూ అధికార కరోనా బారినపడినట్టు తెలిసింది. ఇళ్ల స్థలాలకు భూసేకరణ నిమిత్తం సదరు అధికారి తేలప్రోలులో విధి నిర్వహణలో పాల్గొంటూ, విజయవాడ తేలప్రోలు మధ్య షటిల్‌ చేశారు. నూజివీడు ప్రాంతానికి సమీపంలో విధులు నిర్వర్తించే ఈ అధికారి కరోనా బారిన పడటంతో ఈ ప్రాంత రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. 

Read more