కరోనా కలకలం..
ABN , First Publish Date - 2020-03-08T12:06:09+05:30 IST
కైకలూరు, మండవల్లిలో కరోనా వైరస్ కలకలంరేపింది. ప్రపంచ వ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తున్న కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతుండగా

- బహ్రెయిన్ నుంచి మహిళ రాక
- కరోనా వైరస్ ఉందంటూ ప్రచారం
- వైద్యుల అప్రమత్తం
- లక్షణాలు లేవని నిర్ధారణ
కైకలూరు/మండవల్లి: కైకలూరు, మండవల్లిలో కరోనా వైరస్ కలకలంరేపింది. ప్రపంచ వ్యాప్తంగా భయాన్ని సృష్టిస్తున్న కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతుండగా కైకలూరు, మండవల్లి ప్రాంతాల్లో ఈ వ్యాధి వ్యాపించిందంటూ జరిగిన ప్రచారం ప్రజలను కలవరపరిచింది. శుక్రవారం రాత్రి కువైట్‌లోని బహ్రెయిన్ నుంచి చిగురుపాటి సౌందర్య (25) తన స్వగ్రామమైన మండవల్లి వచ్చింది. దీంతో శనివారం ఉదయం ఆమెకు కరోనా వైరస్ ఉందంటూ ప్రచారం జరగడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొంతమంది ఆమె రాకను నిరాకరించి మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విజయ్‌కుమార్ ఆమెను 108 ద్వారా కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాస్పటల్ సూపరిటెండెంట్ మోహన్‌నాయుడు, కొల్లేటికోట పీహెచ్‌సీ వైద్యాధికారి కె.వేణుగోపాలరావు ప్రత్యేక వార్డును ఏర్పాటుచేసి సౌందర్యకు పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఆమెలో లేవని గుర్తించారు. దీంతో పోలీసులు, వైద్యసిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆమెను కొన్నిరోజులు ఇంటివద్దే ఉండి బైటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచనలు చేశారు. పలు జాగ్రత్తలను పాటించాలన్నారు. ఆమె బంధువులకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జలుబు, దగ్గు, తమ్ములు వంటివివస్తే వెంటనే ప్రభుత్వాసుపత్రికి రావాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది.
అంతకుముందు రాష్ట్రసమాచార ప్రచార కార్యదర్శి ఎల్ ఎస్ భాస్కరరావు, కమిటీ సభ్యుడు మెండ సురేష్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండవల్లి వైద్యాధికారి విద్యులత కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. సౌందర్యకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, పరీశీలనలో ఉంచినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, మండవల్లిలో వీఆర్వో ప్రసాద్, కార్యదర్శి డివిఎన్ జానకీలక్ష్మీల ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేపట్టారు. కరోనా వైరస్ ప్రచారంతో ప్రజలు మాస్కులు కోసం పరుగులు తీశారు.