-
-
Home » Andhra Pradesh » Krishna » Corona disturbance in Nandigama town
-
నందిగామ పట్టణంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-03-23T09:42:54+05:30 IST
నందిగామ పట్టణంలో కరోనా కలకలం రేగింది. పట్టణంలోని మయూరి థియేటర్ సమీపంలో ఒక యువతి దగ్గు, జలుబుతో బాధ పడుతుండడంతో సమీపంలోని వారు సమచారాన్ని పోలీసులకు అందించారు.

నందిగామ, మార్చి 22: నందిగామ పట్టణంలో కరోనా కలకలం రేగింది. పట్టణంలోని మయూరి థియేటర్ సమీపంలో ఒక యువతి దగ్గు, జలుబుతో బాధ పడుతుండడంతో సమీపంలోని వారు సమచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు ఆ యువతిని విచారించగా, ఆమె తన సోదరి పరీక్షల నిమిత్తం లక్నో వెళ్లి వచ్చామని, నీటి ప్రభావం వల్ల జలుబు చేసిందని చెప్పారు. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని పోలీసులు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించారు.
వారికి ఏమీ లేదని తేలడంతో ఇంటికి పంపారు. ఇంటి నుంచి బయటకు రావద్దన్న నిబంధన పెట్టారు. ప్రసార మాద్యమాలలో ఈ విషయం రావడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తి పోయారు. దీనిపై డీఎస్పీ జి.వి.రమణమూర్తి తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో కరోనా లక్షణాలు ఎవరికీ లేవని తెలిపారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నెటిజన్లు సంయమనం పాటించాలని ఆయన కోరారు. అనవసరపు పోస్టింగ్‌లు పెట్టి ప్రజలను భయభ్రాంతులను చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దారు చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు.
ఎనిమిది మందిపై వైద్యుల దృష్టి
తోట్లవల్లూరు: తోట్లవల్లూరు మండలంలో విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందిని గుర్తించారు. ఫిలిప్పీన్స్, లండన్ తదితర దేశాల నుంచి ఎనిమిది మంది మండలంలోని స్వగ్రామాలకు చేరుకున్నట్టు పీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. తోట్లవల్లూరు, చాగంటిపాడు, పెనమకూరు, గరికపర్రు గ్రామాల్లో ఉన్న వీరి ఆరోగ్య స్థితిపై ప్రతిరోజు ఆరా తీస్తున్నారు. వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మండలానికి వచ్చిన అందరూ మంచి ఆరోగ్యంతోనే ఉన్నారని సిబ్బంది తెలిపారు.
అధికారుల అదుపులో ఐదుగురు
మోపిదేవి: తమిళనాడు, హైదరాబాద్ నుంచి ఉత్తరచిరువోలులంక గ్రామానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులను రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌కు చెందిన రామలింగం, అజిత్, రామ్‌కుమార్, పుణే నుంచి వచ్చిన శివరామ్, రామయ్యను రెవెన్యూ, పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షలు నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉత్తరచిరువోలులంక గ్రామంలో దేవాలయ పనుల నిమిత్తం వచ్చినట్లు వారు తెలిపారు. ఈ మేరకు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం వ్యాధి లక్షణాలు లేవని, రెండురోజులు ఇంటి వద్దనే ఉండేలా చూడాల్సిందిగా వైద్యులు తెలిపారు. ఇంట్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దారు సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు.
ఛత్తీ్‌సఘడ్ వాసులకు వైద్య పరీక్షలు
చాట్రాయి: ఛత్తీ్‌సఘడ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది నాలుగు వాహనాల్లో ఆదివారం ఉయ్యూరు వెళుతుండగా కృష్ణారావుపాలెం చెక్‌పోస్టు వద్ద వారిని ఎస్సై శివనారాయణ నిలిపివేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలు ఉయ్యూరు విశ్వశాంతి పాఠశాలలో చదువుతున్నారని, పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లడానికి వెళుతున్నామని ఆధారాలు చూపడంతో, వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారించడం వలన వారిని పంపించి వేశారు.