వీడని భయం.. ఉదయానికి ఆరు.. సాయంత్రానికి మరో తొమ్మిది
ABN , First Publish Date - 2020-05-09T07:30:25+05:30 IST
విజయవాడ కార్మికనగర్‌ను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్
ఉదయం బులిటెన్‌లో ఆరు కేసులు
కార్మికనగర్‌లో ఐదుగురికి.. ఎస్‌ఆర్ఆర్ కళాశాల సమీపంలో ఒకరికి
సాయంత్రానికి మరో తొమ్మిది పాజిటివ్
వీరిలో ముగ్గురు కృష్ణలంక వాసులే
జిల్లాలో 331కి చేరిన కరోనా కేసులు
పూర్తి ఆరోగ్యంతో మరో ముగ్గురి డిశ్చార్జి
(విజయవాడ, ఆంధ్రజ్యోతి): విజయవాడ కార్మికనగర్‌ను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించగా, సాయంత్రానికి మరో తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ కేసులను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. ఈ కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 331కి చేరుకుంది. ఉదయం ప్రకటించిన ఆరు కేసుల్లో కార్మికనగర్‌లో ఐదుగురికి, మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో మరో వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
సాయంత్రానికి పాజిటివ్‌గా తేలిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది విజయవాడకు చెందినవారుకాగా, ఒకరు మచిలీపట్నంకు చెందిన మహిళ. విజయవాడ నగర పరిధిలోని కృష్ణలంకలో మరో ముగ్గురు, అజిత్‌సింగ్‌నగర్‌లో ఇద్దరు, మొగల్రాజపురం టిక్కిల్ రోడ్డు, వించిపేట, బీఆర్‌టీఎస్ రోడ్డులోని దుర్గాపురంలలో ఒక్కొక్కరు కరోనా బారినపడ్డారు. మచిలీపట్నం గాంధీనగర్‌లో ఇటీవల భార్యా భర్తలకు పాజిటివ్ రాగా, వారు విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే కుటుంబంలోని మరో 65 ఏళ్ల మహిళకు కొత్తగా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.
ముందుగానే క్వారంటైన్లో
కార్మికనగర్‌లో ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలో ఇద్దరికి, పొరుగునే ఉంటున్న మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వీరంతా ఇప్పటికే క్వారంటైన్ సెంటర్లలో ఉన్నందున, కార్మికనగర్‌లో కొత్తగా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల సమీపంలో మరో 74 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. ఈమె నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలిసింది.
ముగ్గురు ఇంటికి
కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితుల్లో మరో ముగ్గురు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడంతో వైద్యాధికారులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. పూర్తిగా కోలుకొని ఇంటికి చేరుకున్నవారి సంఖ్య 126కు చేరుకుంది. శనివారం ఉదయం మరో 11 మందిని డిశ్చార్జి చేసేందుకు పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్ ఆసుపత్రి వైద్యాధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆసుపత్రుల్లో ఇంకా 185 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 16,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 322 మందికి పాజిటివ్, 13,488 మందికి నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. 2,414 మందికి సంబంధించిన వైద్యపరీక్షల రిపోర్టులు రావలసి ఉంది. జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లలో ప్రస్తుతం 167 మంది ఉన్నారు.