ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో మూడొంతుల కేసులు ఈ పది రోజుల్లోనే..
ABN , First Publish Date - 2020-06-25T16:45:33+05:30 IST
కరోనా ఊరూవాడలను ఏకం చేస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకూ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 36 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ

నిర్లక్ష్యమే కాటేస్తోంది.. కొందరి అలసత్వం.. అందరికీ శాపం
లాక్‌డౌన్ నిబంధనలు పాటించని యువత
కాలక్షేపం తిరుగుళ్లతో పెరుగుతున్న కేసులు బుధవారం ఉదయానికి 36 కేసులు నమోదు
సాయంత్రానికి 88 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ
మరో ముగ్గురు మరణించినట్లు ధ్రువీకరించిన ప్రభుత్వం
మూడొంతుల కేసులు ఈ పది రోజుల్లోనే..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కరోనా ఊరూవాడలను ఏకం చేస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకూ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 36 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అయితే సాయంత్రానికి జిల్లాలో ఏకంగా 88 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలను తీసుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తే, ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే ప్రమాదాన్ని 90 శాతం వరకు అరికట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటున్నా అత్యధికుల్లో మాకేమీ కాదులే అన్న నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యమే కరోనాబారిన పడేస్తోంది.
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు సంఖ్యలో పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 36 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1132కు చేరుకుంది. ఇదే సమయంలో జిల్లాలో మరో ముగ్గురు వ్యక్తులు కరోనా వల్ల మరణించినట్లు ఆ బులెటిన్‌లో ధ్రువీకరించారు. వీటితో కలిపి జిల్లాలో కరోనా మరణాల సంఖ్య అధికారికంగా 43కు చేరుకుంది. అయితే బుధవారం ఉదయం నుంచి సాయంత్రానికి జిల్లాలో ఏకంగా 88 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల నుంచి ప్రభుత్వానికి రిపోర్టులు వెళ్లాయి. వీటిలో దాదాపు 90 శాతం కేసులు విజయవాడ నగర పరిధిలోనే ఉన్నాయి. విజయవాడ పాతబస్తీలోని బ్రాహ్మణవీధి, భవానీపురం, విద్యాధరపురం, మల్లికార్జునపేట, కేదారేశ్వరపేట, చిట్టినగర్, కొత్తపేట, ఇస్లాంపేట, స్వాతి సెంటర్, పెజ్జోనిపేట, జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీ, అజిత్‌సింగ్‌నగర్, మధురానగర్, సత్యనారాయణపురం, ఆటోనగర్, అయ్యప్పనగర్, రాణిగారితోట తదితర ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇతర పట్టణాలు, పల్లెలోనూ అనేక మంది వైరస్ బారిన పడ్డారు. విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు బాధితులు మరణించారు. ఈ కేసులను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.
అదే అలక్ష్యం
ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటి నుంచి కరోనా వైరస్ జిల్లా మొత్తాన్ని చుట్టేస్తోంది. గత మార్చి నుంచి నమోదైన దాదాపు 1200లకు పైగా కేసుల్లో మూడొంతుల కేసులు ఈ పది రోజుల్లోనే నమోదయ్యాయంటే జిల్లాలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో కరోనా తగ్గిపోయిందన్న భావనతో ప్రజలు విచ్చలవిడిగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. వ్యాపార కేంద్రాల్లో జనం గుంపులు గుంపులుగా చేరిపోతున్నారు. వ్యక్తిగత రక్షణను విస్మరించారు. ప్రత్యేకించి రోడ్లపై యువత కాలక్షేపం పెరిగిపోయింది. ద్విచక్ర వాహనాలపై ఒకరికి మించి వెళ్లరాదనే నిబంధనలను సైతం భేఖాతరు చేస్తూ ఒక్కో బైక్‌పై ముగ్గురేసి ఎక్కి తిరుగుతున్నారు. వీరి కారణంగా వైరస్ వేగంగా వ్యాపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జిల్లాలో కరోనా కేసులను కట్టడి చేయడం ఎవరి చేతుల్లోనూ ఉండదని, పరిస్థితి చేయి దాటిపోకముందే జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుడివాడలో తొలి కరోనా కేసు
గుడివాడ పట్టణంలో తొలి కరోనా కేసు నమోదయింది. పెదపారుపూడి మండలం వానపాముల గ్రామ సచివాలయ ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీవో జి.శ్రీనుకుమార్ బుధవారం వెల్లడించారు. ఆ ఉద్యోగి గుడివాడ రైలుపేటలో నివాసముంటున్నారని ఆర్డీవో తెలిపారు.
గన్నవరంలో మరో ఐదు కేసులు
గన్నవరం మండలంలో మరో ఐదు కరోనా కేసులు బుధవారం నమోదయ్యాయి. గన్నవరంలో మూడు, కేసరపల్లిలో రెండు పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ ఐదు కేసులూ ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టు కేసులే. వీటితో మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరుకుంది.
పెడనలో ఒకే కుటుంబంలో ముగ్గురికి
పెడన పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకింది. పట్టణంలోని ఓ కూల్‌డ్రింక్ షాపు నిర్వాహకుడికి, అతని భార్యకు, తల్లికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
నూజివీడులో కరోనా ఉధృతి
నూజివీడు పట్టణాన్ని కరోనా చుట్టుముడుతోంది. ఇప్పటి వరకు మండలంలో మొత్తం 53 కేసులు నమోదు కాగా, పది మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వారం వ్యవధిలోనే నూజివీడు ప్రాంతంలో కేసుల సంఖ్య 11 నుంచి 50కు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ముదినేపల్లి మండలంలో ఇద్దరికి లక్షణాలు
ముదినేపల్లి మండలంలో కరోనా వైరస్ లక్షణాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను అధికారులు బుధవారం గుర్తించారు. ముదినేపల్లిలో ఓ బ్యాంకు ఉద్యోగికి, సింగరాయ పాలెంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువతికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఇద్దరినీ బందరు ప్రభుత్వాసుపత్రికి పంపించి, కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు ఎస్‌ఐ మణికుమార్ తెలిపారు.
మచిలీపట్నం డివిజన్‌లో 11 కరోనా కేసులు
మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌లో 11 కరోనా కేసులు నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో కరోనా టాస్క్‌ఫోర్స్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ, మచిలీపట్నం డివిజన్‌లో బుధవారం 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మచిలీపట్నంకు చెందిన ఇద్దరు కరోనా కారణంగా మరణించారని చెప్పారు. దీంతో డివిజన్లో మరణాల సంఖ్య ఐదుకు చేరిందన్నారు. మచిలీపట్నం రాజుపేటలో నలుగురికి, బైపాస్ రోడ్డులో ఒకరికి, పెడన పురపాలక సంఘంలో ముగ్గురికి, పెడన మండలం నడుపూరు, బంటుమిల్లి మండలం ములపర్రు, నాగాయలంక మండలం భావదేవరపల్లి, టికొత్తపాలెం ప్రాంతాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణయిందన్నారు. నాగాలయంకలో గుర్తించిన కేసు విస్సన్నపేట ప్రాంత వ్యక్తిదైనందున అక్కడి లెక్కలో కలిపామన్నారు.