తగ్గని ఉధృతి

ABN , First Publish Date - 2020-06-19T09:50:09+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి విజయవాడ నగరంలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. వారం నుంచి

తగ్గని  ఉధృతి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి విజయవాడ నగరంలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. వారం నుంచి వైరస్‌ జిల్లా అంతటా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్క రోజే జిల్లాలో 30 మందికి పైగా కరోనా సోకింది. మరో ఇద్దరు కరోనా కారణంగా మరణించినట్లు గురువారం ఉదయం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ధ్రువీకరించింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య అనధికారికంగా 1091కి చేరుకోగా.. మరణాల సంఖ్య అనధికారికంగా 43కు చేరింది.


గురువారం విజయవాడ నగరంలోని వన్‌టౌన్‌ ఎర్రకట్ట, విద్యాధరపురం, కొత్తపేట కుమ్మరివీధి, నెహ్రూ బొమ్మ సెంటర్‌, శ్రీనివాస మహల్‌, పంజాసెంటరు, మహంతిపురం, చిట్టినగర్‌, ఖుద్దూస్‌నగర్‌, కృష్ణలంక, రాజరాజేశ్వరి నగర్‌లలో 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మచిలీపట్నం, నూజివీడు, ఉయ్యూరు, ఊటుకూరు, నందిగామ వంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. 


మచిలీపట్నం డివిజన్‌లో 54 కేసులు

మచిలీపట్నంలో కరోనా కారణంగా జవ్వారుపేటకు చెందిన 70ఏళ్ల వృద్దుడు గురువారం మరణించినట్లు ఆర్డీవో ఖాజావలి వెల్లడించారు. మచిలీపట్నంలో ఇప్పటివరకు కరోనాతో మూడు మరణాలు సంభవించాయని తెలిపారు. బందరులో 29 కరోనా కేసులు నమోదు కాగా, 11 కంటైన్మెంట్‌జోన్‌లు ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2020-06-19T09:50:09+05:30 IST